ఆ విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు.. పాక్ నటి  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు.. పాక్ నటి 

May 22, 2020

పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ రోజు విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇండ్ల మీద విమానం పడటంతో ప్రాణనష్టం బాగానే జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. తాను, తన భర్త మరణించినట్టు వచ్చిన వార్తలను ఆ దేశ నటి అయేజా ఖాన్ ఖండించింది. ప్రమాదం జరిగిన ఆ విమానంలో తాము లేమని, అవన్నీ పుకార్లేనని తీవ్రంగా స్పందించింది. ప్రమాదం జరిగిన విమానంలో అయేజా, ఆమె భర్త డానిష్ తైమూర్ ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని.. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను మానుకోవాలని కోరింది. 

ఇప్పటికైనా ఈ వదంతులకు చెక్ పెట్టాలని కోరింది. దయచేసి ఇకనైనా అందరూ బాధ్యతగా  వ్యవహరించాలని చెప్పింది. పాకిస్తాన్‌లో ఈ రోజు మధ్యహ్నం కుప్పకూలిన విమానంలో ప్రయాణించిన వారందరూ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. భారీగా మంటలు ఎగసిపడడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లాహోర్ నుంచి బయల్దేదిన విమానం కరాచీలోని జిన్నా ఎయిర్ పోర్టులో లాండ్ అవుతూ కుప్పకూలింది. 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ప్రయాణించిన విమానం కుప్పకూలిపోయింది.