రోడ్డుపై నమాజ్ చేస్తే రోడ్డు వాళ్లదవుతుందా? అయోధ్య కేసులో వాదన
వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు రోజూ వాదనలు వింటున్న విషయం తెలిసిందే. రామలల్లా విరాజమాన్ తరఫున ఈ రోజు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్.. వివాదాస్పద స్థలంలో గుడి ఉండేదంటూ కోర్టుకు కొన్ని ఫొటో ఆధారాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. వివాదాస్పద స్థలంలో ముస్లింలు నమాజ్ చేసినంత మాత్రాన దాన్ని వారికి అప్పగించడం సరికాదన్నారు.
‘రోడ్డుపై నమాజ్ చేస్తే రోడ్డు వాళ్లదవుతుందా? వివాదాస్పద స్థలంలోని స్తంభాలపై శివుడు వంటి హిందూ దేవతల చిత్రాలు, ముద్రలు, శాసనాలు లభించాయి. కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకోవాలి’ అని వైద్యనాథన్ కోరారు. 1950 ఏప్రిల్ 16 నాటి నివేదికను కూడా ఆయన కోర్టుకు చదివి వినిపించారు. నివేదిక ప్రకారం.. అక్కడ దొరికిన స్తంభాలపై శివుడి చిత్రాలు ఉన్నాయని, అవి మసీదుల్లో ఉండవని వివరించారు. గుడి శిథిలాలపై బాబ్రీ మసీదును నిర్మించి ఉంటే అది షరియత్ ప్రకారం మసీదు అనిపించుకోదని అన్నారు. ఈ కేసులో మధ్యవర్తిత్వం పనిచేయకపోవడంతో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసం రోజువారీ విచారణ జరుపుతోంది..