అయోధ్య వివాదంపై సుప్రీం విచారణ - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య వివాదంపై సుప్రీం విచారణ

July 11, 2019

Ayodhya land dispute

అయోధ్య వివాదంపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మధ్యవర్తిత్వంతో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం సమస్య పరిష్కారం కాదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టింది. అయోధ్య కేసులో ఈ నెల 18లోపు సమగ్ర నివేదికను ఇవ్వాలని మధ్యవర్తిత్వ కమిటీని ఆదేశించింది. ఆ నివేదికలో మధ్యవర్తిత్వ కమిటీ సరైన పరిష్కారం చూపించకపోతే జులై 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. 

మధ్యవర్తిత్వంతో సామరస్య పరిష్కారం కనిపించడం లేదని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షదారుల్లో ఒకరైన గోపాల్‌ సింగ్‌ విశారద్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విశారద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ పరశరణ్‌ వాదనలు వినిపించారు. దీనిపై వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వ కమిటీ వారంలోగా అయోధ్యపై నివేదిక అందించాలని ఆదేశాలు జారీచేసింది. నివేదిక అందిన వెంటనే పరిశీలించి అదే రోజు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టంచేసింది. 

అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరానికై ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా,  ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు, ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ముగ్గురు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా, కమిటీ ఇటీవల మధ్యంతర నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరింది. దీంతో న్యాయస్థానం అయోధ్య పరిష్కారం కోసం కమిటీకి ఆగస్టు 15 వరకు గడువు కల్పించింది.