వివాదంలో నలిగిన అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలంలో రామమందిరం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త ట్రస్టు అక్క్లేదని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ)కు చెందిన రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు నృత్యగోపాల్ దాస్ అన్నారు. ‘ఇప్పటికే రామజన్మభూమి న్యాస్ ఉంది. అంతగా అవసరమైతే దీన్నే విస్తరిస్తాం. కొత్త వారిని చేర్చుకుంటాం..’ అని ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే ట్రస్టు ఏర్పాటు విషయంలో హిందూ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం కొత్త ట్రస్టును ఏర్పాటు చేయాలని దిగంబర్ అఖాడా చీఫ్ మహంత్ సురేశ్ దాస్ కోరారు. రామజన్మభూమి న్యాస్ సభ్యులు అందులో ప్రతినిధులుగా ఉండాలన్నారు. కొత్త ట్రస్టులో అఖాడా సభ్యులకు రిజర్వేషన్ కల్పిచాలని నిర్మోహి అఖాడా చీఫ్ మహంత్ దినేంద్ర దాస్ సూచించారు. ట్రస్టులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లకు చోటు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేత శరద్ శర్మ కోరారు. వారు ట్రస్టులో ఉంటే ఆలయ నిర్మాణానికి ఆటంకాలు కలగవని అన్నారు. ఆలయ పనుల్లో 65 శాతం పూర్తయ్యాయని, వచ్చే ఏడాది శ్రీరామనవమి రోజుల శంకు స్థాపన చేస్తామని చెప్పారు. కాగా 1989 వీహెచ్పీ ప్రతిపాదించిన నమూనాలోనే ఆలయాన్ని నిర్మించాలని మెజారిటీ హిందుత్వ సంఘాలు కోరుతున్నాయి.