‘ముస్లింల సమాధులపై రామాలయమా?’.. అయోధ్యలో కొత్త రగడ - MicTv.in - Telugu News
mictv telugu

 ‘ముస్లింల సమాధులపై రామాలయమా?’.. అయోధ్యలో కొత్త రగడ

February 18, 2020

Ayodhya temple.

దశాబ్దాల పాటు సాగిన అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు రావడం, వివాద స్థలాన్ని హిందువులకు, మసీదు కోసం మరో చోట 5 ఎకరాలను ముస్లింలకు ఇవ్వాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. దీంతో రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రస్టీని ఏర్పాటు చేసి రేపోమాపో పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మసీదు కోసం యూపీ ప్రభుత్వం కూడా అయోధ్యకు పాతిక కి.మీ.దూరంలో స్థలాన్ని కేటాయించింది. వివాదం ఎలాగోలా ముగిసిందని ఊరి జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. 

అయితే గొడవ అంత సులువుగా పరిష్కారం కాదంటూ మరో వివాదం రేగింది. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చిన చోట ముస్లింల సమాధులు ఉన్నాయని అక్కడ, రామాలయాన్ని ఎలా నిర్మిస్తారని ముస్లిం మతపెద్దలు అభ్యంతరం చెబుతున్నారు. ఈమేరకు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు లేఖ కూడా రాశారు. ‘1885లో జరిగిన అల్లర్లలో చనిపోయిన 75 మంది ముస్లింలను బాబ్రీ మసీదు చుట్టుపక్కలే పూడ్చేశారు. నాలుగైదు ఎకరాల్లో ముస్లింల గోరీలు ఉన్నాయి…’ అని ముస్లింల న్యాయవాది ఆర్.షంషద్ తెలిపారు. 

ఎవరు చెప్పారు? 

అయితే బాబ్రీ మసీదు చుట్టుపక్కల శ్మశానంగానీ,  ఎవరి సమాధులూ గానీ లేవని జిల్లా కలెక్టర్ అనూజ్ ఝా వెల్లడించారు. అక్కడి 67 ఎకరాల్లో సమాధులు లేవని, ఈ అంశాన్ని సుప్రీం కోర్టు ఇదివరకే పరిశీలించిందని తెలిపారు. కాగా, ఆలయ ట్రస్ట్ రేపు తొలిసారిగా సమావేశం కాబోతోంది.  ట్రస్టు బోర్డు సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయావాది కె.పరాశరన్ ఇంట్లో ట్రస్టు సభ్యులు భేటీ కానున్నారు.