మరికాసేపట్లో అయోధ్య తుది తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

మరికాసేపట్లో అయోధ్య తుది తీర్పు

November 9, 2019

దేశప్రజలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వివాదాస్పద అయోధ్య భూమి కేసులో సుప్రీం కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించనుంది. ఉదయం 10:30 గంటలకు తీర్పు రానుంది. తీర్పు నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అయోధ్యలో పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. 

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర బహిరంగ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 40 వేల మంది భద్రతా సిబ్బంది నిఘా పెట్టారు. సమస్యాత్మక ఆరు రాష్ట్రాల్లో పాఠశాలలకు ఈనెల 11వరకు సెలవులు ప్రకటించారు. తీర్పు నేపథ్యంలో ఐదుగురు జడ్జీలకు భద్రత పెంచారు. తుది తీర్పు వెలువరించేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. చీఫ్ జస్టిస్‌తో పాటు నలుగురు జడ్జీలు కోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో అయోధ్య కేసుపై తుదితీర్పు వెల్లడించనున్నారు. కోర్టు హాల్‌కు పిటిషనర్లకు మాత్రమే అనుమతి ఉంది. కోర్టు ప్రాంగణంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని పక్షాల తరపు న్యాయవాదులు, మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది.