ఆయుర్వేద చికెన్ అంటే ఇదీ! మరి గొర్రెల సంగతేంటి?  - MicTv.in - Telugu News
mictv telugu

ఆయుర్వేద చికెన్ అంటే ఇదీ! మరి గొర్రెల సంగతేంటి? 

July 18, 2019

Ayurveda chicken issue .....

కోడి మాంసం తినేవాళ్లు శాకాహారులా, మాంసాహారులా? అస‌లు కోడి శాకాహారం కింద‌కు వ‌స్తుందా, మాంసాహారం కింద‌కు వ‌స్తుందా?  టైం పాస్ కోసం, ఏ ప‌నీపాటా లేకుండా న‌వ్వుకోడానికి చ‌ర్చ పెట్టే వారు ఈ ప్ర‌శ్న అడిగితే తేలిగ్గా తీసుకోవ‌చ్చు. కానీ ప్రజలు వేళ్లకు సిరామరకలు అంటించుకుని మరీ ఎన్నుకున్న ఓ ఎంపీ, అదీ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన నేప‌థ్యం ఉన్న నేత పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌శ్నిస్తే, ఆయ‌న్ని ఏమ‌నాలి? ఇదేదో జోక్ కాదు. శివ‌సేన ఎంపీ, సీనియ‌ర్ పొలిటీషియ‌న్ సంజ‌య్ రౌత్, ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందు లేవ‌నెత్తిన ప్రశ్న ఇది. ప్రశ్నతోపాటు ఆయన ఓ గమ్మత్తయిన విషయం కూడా చెప్పాడు. తాను ఆయుర్వేద కోడిమాంసాన్ని తిన్నానని గొప్పలు చెప్పుకున్నాడు. తనకు గిరిజనులు ఆయుర్వేద కోడిమాంసం పెట్టారని, దానితో జబ్బులు పోతాయని చెప్పారని రౌత్ రాజ్యసభకు చెప్పారు. చికెన్ మాంసమా, శాకమా అన్న చర్చను పక్కనబెడితే ఆయన చెప్పిన ఆయుర్వేద కోడిపై జనంలో ఆసక్తి పెరిగింది.  

ఇలా పెంచితే ఆయుర్వేద కోడి.. 

ఓ కోడిని ఆయుర్వేద మూలిక‌లు, స్వ‌చ్ఛమైన ఆకులు, అలములు వంటి శాకాహార దాణాతో పెంచితే, అది ఆయుర్వేద చికెన్ అంటున్నారు కొందరు. మీర‌ట్‌లోని చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్లు ఆయుర్వేద కోడి గుడ్డుపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వాదన సరికాదని, కోడి గడ్డీగాదం తిన్నా, పురుగులు మెక్కినా అది పక్కా మాంసాహారమే అవుతుంది తప్పితే శాకాహారం కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కోళ్లను ఎవరూ మాంసం వేసి పెంచడం లేదని, రొయ్యపొట్టు వంటివాటితో పెంచినా అది చాలా తక్కువ అని వివరిస్తున్నారు. ఆయుర్వేద కోడిని నమ్మితే, గడ్డీగాదం తినే గొర్రెలు, మేకలు, ఎద్దులు, గేదెలు వంటి మాంసం కూడా ఆయుర్వేద ఆహారం కిందికే వస్తుందని, అది మతిలేని వాదన అని అంటున్నారు.