కోపంతో మనిషి తీసుకునే నిర్ణయాల వల్ల అతనికే కాదు ఎదుటి వ్యక్తి కూడా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. చేయని తప్పుకు అనవసరంగా ఇంకొకరు బలవుతుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ విద్యార్ధి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అతని ప్రన్సిపాల్ ప్రాణాలు తీసింది. ఆవేశంలో ఆమెను దారుణంగా చంపేశాడు. ఇండోర్‌లోని ఓ బీఫార్మసీ కాలేజీలో అశుతోష్ శ్రీవాస్తవ అనే విద్యార్ధి చదువు పూర్తి చేశాడు. దీంతో ఈ నెల 20న కాలేజీకి వెళ్లి తన మార్కుల మెమో ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపాల్ విముక్త శర్మను కోరాడు. అయితే 7వ సెమిస్టర్ ఫెయిల్ అయినందున మెమో ఇవ్వడం కుదరదని విముక్త శర్మ చెప్పడంతో శ్రీవాస్తవ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కాలేజీ యాజమాన్యం అక్రమంగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. అంతటితో ఆగక ప్రిన్సిపాల్ విముక్త శర్మపై పెట్రోల్ పోసి సిగరెట్ లైటర్‌తో నిప్పంటించేశాడు. ఈ దహనం ఘటనలో విముక్త శర్మ శరీరం 80 శాతం కాలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి శనివారం మరణించారు. అటు ఘటన జరిగిన రోజే నిందితుడు శ్రీవాస్తవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం సర్టిఫికెట్ ఇవ్వనని చెప్పినందుకు ప్రిన్సిపాల్‌ని చంపేసిన ఘటన స్థానిక ప్రజలకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.