గుర్మీత్ బాబాకు 20 ఏళ్ల జైలు - MicTv.in - Telugu News
mictv telugu

గుర్మీత్ బాబాకు 20 ఏళ్ల జైలు

August 28, 2017

ఇద్దరు మహిళలపై అత్యాచార కేసులో డేరా బాబా గుర్మీత్ రాంరహీం సింగ్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాబా ఉంటున్న రోహతక్ జైల్లో సోమవారం మధ్యాహ్నం గట్టి భద్రత ఏర్పాట్ల నడుమ శిక్ష ఖరారుపై  వాదనలు జరిగాయి. బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష వేయాలని సీబీఐ కోరింది. బాబా చేసిన సేవాకార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని తేలికపాటి శిక్షతో సరిపెట్టాలని ఆయన లాయర్లు అభ్యర్థించారు. వాదనల అనంతరం జడ్జి జగదీప్ సింగ్.. బాబాకు పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు.  ఒక్కో అత్యాచారానికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 15 లక్షల జరిమానా విధించారు. బాధితులకు రూ. 14 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. తనకు క్షమాభిక్ష పెట్టాలని బాబా కన్నీటి పర్యంతమవుతూ జడ్జిని వేడుకున్నారు. అయినా నేరానికి శిక్ష అనుభవించాల్సిందేనంటూ జడ్జి ఆయన వినతిని తోసిపుచ్చారు. ‘సత్యమే గెలుస్తుంది. నేనే తప్పూ చేయలేదు.. ’ అని అరెస్టుకు ముందు గొప్పలు పోయిన బాబా కోర్టులో క్షమాభిక్ష కోరడం గమనార్హం. అయితే ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.  తీర్పు సందర్భంగా కోర్టుకు ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

 

మరోపక్క.. బాబా అనుచురల వీరంగం మాత్రం కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల వారు వాహనాలను ధ్వంసం చేశారు. బాబా అనుచరులు సంయమనం పాటించాలని డేరా సచ్చా సౌదా కోరినా ఫలితం లేకపోయింది. బాబాకు శిక్ష నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ అత్యవసరంగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేశారు. పంజాబ్, హరిణాయాల్లో ఎలాంటి హింసా జరక్కుండా భారీ ఎత్తున్న భద్రతా దళాలను మోహరించారు.