పుంగనూరు ఆవు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్సో తెలిసిందే. పొట్టి ఆకారంతో, చూపరులను ఆకర్షించే అందంతో కట్టిపడేస్తాయి. ఒకప్పటితో పోలిస్తే ఈ ఆవుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. పాల దిగుబడి తక్కువగా ఇచ్చే ఈ ఆవుల మేతకు ఖర్చు తక్కువ అవుతుంది. అయితే మిగతా ఆవులతో పోలిస్తే ఈ ఆవు పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఈ పుంగనూరు ఆవు గుంటూరు జిల్లా తెనాలిలో రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది. స్థానికంగా ఉండే కంచర్ల శివకుమార్ వద్ద ఈ ఆవు ఉందని తెలియడంతో హరిద్వార్‌లోని బాబా రాందేవ్ ఆశ్రమం నుంచి ప్రతినిధులు వచ్చి రూ. 4.10 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ ధరను చూసి తెనాలి రైతులు ఆశ్చర్యపోయారు. ఈ ఆవులను పెంచితే మంచి లాభాలు ఉంటాయని పశు వైద్యాధికారి నాగిరెడ్డి తెలిపారు.