బాబ్రీ మసీదు కూల్చివేతపై కీలక తీర్పు.. అంతా నిర్దోషులే  - MicTv.in - Telugu News
mictv telugu

బాబ్రీ మసీదు కూల్చివేతపై కీలక తీర్పు.. అంతా నిర్దోషులే 

September 30, 2020

NVNVN

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువడింది. లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తుది తీర్పును చెప్పింది. ఆనాటి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్ధోషులేనని ప్రకటించింది. మసీదు కూల్చివేత వెనక కుట్ర కోణం ఉందనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు. సీబీఐ అధికారులు ఇచ్చిన ఆడియోలు, వీడియోలు ప్రామాణికంగా లేవన్నారు. అందువల్ల వారిని దోషులుగా చూడలేమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 2000 పేజీల తీర్పును చదివి వినిపించారు.  

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో  ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ,నృత్యగోపాల్ దాస్, కల్యాణ్ సింగ్ సహా 32 మంది ఆరోపణలు ఎదుర్కొన్నారు.  28 సంవత్సరాల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెల్లడైంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో 26 మంది మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. అద్వానీ, ఉమా భారతీ, జోషీ సహా మిగిలిన వారు భౌతికంగా హాజరుకాలేదు. తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్న వారందరికి ఊరట కలిగింది.