30న బాబ్రీ కూల్చివేత తీర్పు.. అద్వానీ హాజరు! - MicTv.in - Telugu News
mictv telugu

30న బాబ్రీ కూల్చివేత తీర్పు.. అద్వానీ హాజరు!

September 17, 2020

bg

అయోధ్యలోని బాబ్రీ మసీదును 1992 డిసెంబర్‌ 6న కరసేవకులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని కొందరు నేతలు రెచ్చగొట్టారని వారిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో బీజేపీ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్, వినయ్‌ కటియార్, స్వాధి రితంబర సహా 32 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 

ఈ కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. ఈ ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత తీర్పు రాబోతోంది. ఈ కేసుని విచారిస్తున్న లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌కే యాదవ్‌ తీర్పు వెలువడే 30వ తేదీన నిందితులు అందరూ కోర్టుకి హాజరు కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. బాబ్రీ కేసులో ఈ నెల 1న వాదనలు పూర్తయ్యాయి. బాబ్రీ కేసుని విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగు తుండగానే 16 మంది మరణించారు.