మీ బిడ్డకు మా పేరు పెడితే 18 ఏళ్లపాటు వైఫై ప్రీ - MicTv.in - Telugu News
mictv telugu

మీ బిడ్డకు మా పేరు పెడితే 18 ఏళ్లపాటు వైఫై ప్రీ

October 19, 2020

Baby girl named after internet provider gets 18-years of free WiF.jp

జనాల్లో షాపింగ్ మోజు రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు కళ్లు చెదిరే రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఆ ఆఫర్లకు ఆకర్షితులై చాలామంది వాటిని పొందేందుకే షాపింగ్ చేసేవారు ఉన్నారు. ముఖ్యంగా పండగ సీజన్లలో చిత్రవిచిత్రమైన ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా స్విట్జర్లాండ్‌లోని ఓ కంపెనీ వెరైటీ ఆఫర్‌ను ప్రకటించింది. ‘మీకు పుట్టే బిడ్డకు మా కంపెనీ పేరు పెడితే .. వారికి 18 ఏళ్లపాటు ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తాం. నవజాత శిశువులకు Twifius లేదా Twifia అని పేరు పెట్టాలి.  ఆసక్తి గల తల్లిదండ్రులు పిల్లల బర్త్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలి. వెరిఫికేషన్ తరువాత కంపెనీ నుంచి 18 సంవత్సరాల ఉచిత ఇంటర్నెట్‌ను అందిస్తాం’ అని  స్విస్ ఇంటర్నెట్ సంస్థ Twifi ప్రకటించింది. ఈ ప్రకటన చూసి చాలామంది ముక్కున వేలు వేసుకున్నారు. బయటకు వెళ్లినవారు వైఫై కోసం చాలామంది వెంపర్లాడుతుంటారు. అలాంటి వైఫై 18 ఏళ్లు ఉచితంగా తమ ఇంటికే వస్తోందంటే కాదంటారా? పేరు వెల్లడించడానికి అంగీకరించని ఓ స్విస్ జంట ఈ ఆఫర్‌ను ఎంచుకుని తమ అంగీకారాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. తమ కుమార్తెకు Twifia అనే పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. దీంతో సదరు సంస్థ వారికి 18 ఏళ్ల పాటు ఉచితంగా వైఫై సేవలను అందించడానికి సిద్ధం అయింది. 

మరోపక్క ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంటర్నెట్ సదుపాయం కోసం ఖర్చు చేయడానికి బదులుగా మిగిల్చిన డబ్బును తమ కుమార్తె పేరుతో సేవింగ్స్ అకౌంట్‌లో వేస్తామని వారు తెలిపారు. భవిష్యత్తులో కారు లేదా ఇతర వస్తువులు కొనడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకుంటామని ఆనందం వ్యక్తంచేశారు. కొత్త పేరు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని ఆ దంపతులు అభిప్రాయపడ్డారు. కానీ ఇది మంచి నిర్ణయమే అని పాప తండ్రి అన్నాడు. ‘మా పాపకు ఈ పేరు ఎప్పటికీ ఒక కనెక్షన్‌గా నిలుస్తుంది. ఇంతకన్నా బాగాలేని ఎన్నో పేర్లను మనం వింటుంటాం. Twifia అనే పేరు మనసు లోతుల్లోంచి  వినిపిస్తుంది’ అని పాప తల్లి అన్నారు. వారి నిర్ణయాన్ని Twifi సంస్థ యజమాని ఫిలిప్ ఫోట్ష్ అభినందించారు. ‘మా సంస్థ ఈ వ్యాపారం నుంచి వైదొలగినా, రాబోయే 18 సంవత్సరాలకు ఈ జంట ఇంటర్నెట్ సదుపాయం కోసం డబ్బు చెల్లిస్తాం. పిల్లలకు మా సంస్థ పేరు పెట్టడం అనేది గౌరవంగా భావిస్తున్నాం. మా సంస్థ నుంచి ఈ ఆఫర్ ఇతర తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉంటుంది’ అని ఫిలిప్ ఫోట్ష్ హామీ ఇచ్చారు.