సాధారణంగా మనిషికి గుండె ఎడమవైపు ఉంటుంది. కానీ ఇటీవల జన్మించిన ఓ చిన్నారికి మాత్రం తన గుండె కుడివైపున ఉండటం వైద్యులు గుర్తించారు.ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారికి కుడివైపు గుండె ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది. మెదక్ జిల్లా తుఫ్రాన్‌లో ఈ ఘటన జరిగింది. వైద్య చరిత్రలోనే చాలా అరుదైన ఘటనగా డాక్టర్లు చెబుతున్నారు. జన్యుపరమైన లోపం వల్లే కోట్లలో ఒకరు ఇలా జన్మించే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై ఎటువంటి భయాందోళన అవసరంలేదన్నారు.
ఆబోతుపల్లికి చెందిన రమ్య పరీక్షల కోసం వెళ్లగా వైద్యులు స్కానింగ్ నిర్వహించారు. అప్పుడు చిన్నారి గుండె కుడివైపు ఉందని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇటీవల ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ప్రసవం జరిపారు. పండంటి ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆరోగ్యాంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని అన్నారు.