Bad Air quality In Delhi
mictv telugu

రాజధానిలో డేంజర్ బెల్స్

November 4, 2022

కాలుష్యం కమ్మేసింది. అడుగు బయటపెట్టాలంటే గుండెల్లో దడ. ప్రమాదకర స్థాయికి చేరిన వాయుకాలుష్యం జనాన్ని భయపెడుతోంది. కాలుష్య సమస్య పరిష్కారానికి పూనుకోవాల్సిన ప్రభుత్వాలు… కారణం మీరంటే మీరంటూ కొట్లాడుకుంటున్నాయి. చివరకు మానవహక్కుల కమిషన్ జోక్యం చేసుకుంది. పొల్యూషన్ కంట్రోల్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ, పంజాబ్ , హర్యానా ప్రభుత్వాలకు నోటిసులు ఇచ్చింది.

ప్రమాదకర పరిస్థితి

దేశరాజధాని ఢిల్లీలో డేంజర్ బెల్స్ మొగుతున్నాయి. చలికి తోడు పంట పొలాల్లో కాలుస్తున్న వ్యర్థాలు కలవరపెడుతున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం 472 దగ్గర ఉంది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. ఢిల్లీలో అడుగు బయటపెట్టాలంటే మాస్క్ తప్పనిసరి. గాలి నాణ్యత అంతకంతకూ క్షీణిస్తుండటంతో స్కూళ్లను మూసివేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నుంచి ఐదో తరగతి వరకు స్కూల్స్ మూసివేయనున్నారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకోవాలని అధికారులు తెలిపారు. ఆపై తరగతుల విద్యార్థుల్ని బయట ఆటలు ఆడించకూడదని ఆదేశించారు.
పరిస్థితులు మెరుగుపడేదాకా ప్రైమరీ స్కూల్స్ క్లోజ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించింది.

ఆ వాహనాల్ని నో ఎంట్రీ

ఢిల్లీలో వాహనాల విషయంలో సరిబేసి విధానాన్ని అమలు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం యోచిస్తోంది. ఢిల్లీ పరిసరప్రాంతాల్లో డీజిల్ వాహనాలకు ఎంట్రీ లేదని తేల్చిచెప్పింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు, సీఎన్జీ, ఎలక్టిక్ వాహనాలకే అనుమతిస్తున్నామని చెప్పింది. రోడ్లు వేయడం, బ్రిడ్జిల నిర్మాణం, పెద్ద ప్రాజెక్టుల పనుల్ని ఆపేయాలని ఆదేశించింది.

ఒకరిపై ఒకరు నిందలు

ఢిల్లీ కాల్యుష్యానికి మీరంటే మీరు కారమణని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకుంటున్నాయి. కాలుష్యం పంజాబ్ , ఢిల్లీకే పరిమితమైంది కాదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరభారత సమస్య అని అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. పంజాబ్ సీఎంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యానికి పంజాబ్ రైతులు కూడా కారణమని చెప్పారు. రెండు పంటలకు మధ్య గ్యాప్ లేకపోవడంతో వారు అలా చేస్తున్నారని..వారిని తప్పుపట్టలేమన్నారు.

ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు

ఢిల్లీలో పెరుగుతోన్న కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అలర్ట్ అయింది. పంజాబ్ , హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 10లోగా తమ ముందు హాజరుకావాలని ఆ రాష్ట్రాల సీఎస్ లను ఆదేశించింది.

పడిపోతున్న గాలి నాణ్యత

ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో రోజురోజుకు గాలి నాణ్యత పడిపోతుంది. యూపీలోని నోయిడా 562తో తీవ్రస్థాయిలో ఉంది. గురుగ్రామ్ 539,ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలో 572 ఉంది. ప్రస్తుతం గాలి నాణ్యత ఢిల్లీలో 472గా ఉంది.