Bad news for football fans...ban on Indian football
mictv telugu

ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..ఫుట్‌బాల్‌పై నిషేధం

August 17, 2022

భారతదేశంలో ఫుట్‌బాల్ ఆటకు ఎంతమంది అభిమానులు ఉన్నారో మాటల్లో చెప్పలేము. ఫుట్‌బాల్ ఆటకు సంబంధించి ఏదైనా స్పోర్ట్స్ ఛానెల్‌లో లైవ్ వస్తే చాలు అభిమానులు కన్ను అర్పకుండా చూస్తారు. అటువంటి భారత ఫుట్‌బాల్ ఆటపై పుట్‌బాల్‌ సంఘం (ఫిఫా) నిషేధం విధిస్తూ, ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, భారత్‌లో అక్టోబరు 11 నుంచి 30 తేదీలలో నిర్వహించాల్సిన అండర్‌-17 మహిళల ప్రపంచ కప్‌ నిర్వహణను కూడా రద్దు చేసింది.

ఈ కఠిన నిర్ణయానికి కారణం ఏంటో కూడా ఫిఫా తెలియజేసింది. ”భారత ఫుట్‌బాల్‌ సంఘం 85 ఏండ్ల చరిత్రలో ఫిఫా నిషేధం ఎదుర్కోవడం ఇదే ప్రథమం. భారత ఫుట్‌బాల్‌ సంఘం వ్యవహారాలలో ఇతరుల జోక్యం సహించబోం. ఇది మా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇతరుల జోక్యం లేకుండా వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఇదివరకే భారత ఏఐఎఫ్‌ఎఫ్‌కు సూచించాం. అయినా, తీరు మారలేదు. ఇతరుల జోక్యాన్ని నిరసిస్తూ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం” అని ఫిఫా ఓ లేఖను విడుదల చేసింది.

గత కొంతకాలంగా భారత ఫుట్‌బాల్‌ సంఘంలో వర్గపోరు వ్యవహారాలు వీధికెక్కాయి. కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఏఐఎఫ్‌ఎఫ్‌ కార్యకలాపాల నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది నచ్చని ఫిఫా గతంలోనే లేఖ రాస్తూ, భారత ఫుట్‌బాల్‌ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం లేకుండా వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఏఐఎఫ్‌ఎఫ్‌కు సూచించింది. అయినా, పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఫిఫా తాజాగా బిగ్‌షాక్ ఇచ్చింది.

మరోపక్క భారత ఫుట్‌బాల్‌ సంఘంపై ఫిఫా నిషేధం విధించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ వ్యవహారాలకు సంబంధించి, సత్వరమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ వ్యవహారాలను ప్రస్తుతం సుప్రీంకోర్టు నియమిత కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పర్యవేక్షిస్తుంది. తాజా పరిణామంతో ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికలు, నూతన కార్యవర్గ నియామకం, తదితర అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని విన్నవించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం ఎత్తివేయించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని, అండర్‌-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేదని.. భారత ఫుట్‌బాల్‌ సంఘం అధికారి ఒకరు తెలిపారు.