టెక్కీలకి కష్టకాలం రాబోతోంది. సాఫ్ట్ వేర్ కంపెనీలపై ట్రంప్ ఎఫెక్ట్ పడిందా… కాగ్నిజెంట్ , ఇన్ఫోసిస్, టీసీఎస్ , విప్రోలాంటి సంస్థల్లో కొలువుల కోతను చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు సాఫ్ట్ వేర్ బూమ్ పడిపోకపోయిన కష్టకాలం తప్పదు. ట్రంప్ కు జై కొట్టిన ఐటీ కంపెనీలు అమెరికాలో ఉద్యోగాల కల్పనకోసం భారత్ లో మైనస్ బాట పట్టాయి. కంట్రోల్ షిప్ట్ డిలీట్ అంటూ టెక్కీల లైఫ్ తో ఆటాడుకుంటున్నాయి. ఇంతటితో ఇది ఆగలేదని, కొత్త టెక్నాలజీలకు సిద్ధం కాని ఇంజినీర్లను తొలగించడాన్ని మరింత పెద్దఎత్తున ఐటీ సంస్థలు కొనసాగిస్తాయని, ఎగ్జిక్యూటివ్‌ల ఎంపికలో సాయపడే హెడ్‌హంటర్స్ ఇండియా అంటోంది.
ఇన్నాళ్లూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ రాజభోగాలు! భారీ జీతాలు.. ఏటా ఇంక్రిమెంట్లు.. వారాంతాల్లో పార్టీలు.. మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలతో సరదాగా గడిపేవారు!! కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆటోమేషన్ దెబ్బకే సగం భయపడుతుంటే.. ట్రంప్ వచ్చాక ఒత్తిడి మరింత పెరిగింది. ఇంక్రిమెంట్లకు బదులు పింక్‌స్లిప్పులు ఎదురుచూస్తున్నాయి. ఇన్నాళ్లూ.. ‘మా కంపెనీలో ఉద్యోగం మానొద్దు’ అంటూ బతిమాలిన యాజమాన్యాలే.. ఇప్పుడు పనితీరు బాగోలేదంటూ ఉద్యోగాలు తీసేస్తున్నాయి. ఆ మాట చెప్పినా పర్వాలేదు.. మరీఘోరంగా.. చెప్పుకోవడానికే సిల్లీగా అనిపించే కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో ఒకరోజు ఎప్పుడో ఆలస్యంగా ఆఫీసుకు వచ్చారనో.. బాస్ మెయిల్‌కి వెంటనే స్పందించలేదనో.. క్లయింట్‌తో గట్టిగా మాట్లాడుతున్నారనో.. భాష సరిగా లేదనో.. గతంలో తోటి ఉద్యోగి ఫిర్యాదు ఆధారంగానో ఇప్పుడు వేటు వేస్తున్నారు.
ట్రంప్ ఎఫెక్ట్‌తో.. అమెరికాలో అక్కడివారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి రావడంతో.. ఆ ఖర్చును తగ్గించుకోవడానికి ఐటీ కంపెనీలు తిప్పలు పడుతున్నాయి. ఉద్యోగుల నైపుణ్యానికి ఏడాదికొకసారి ఇచ్చే స్కోరింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకే ఒక మోస్తరు స్కోరింగ్ వేసి వదిలించుకుంటున్నాయి. ఐటీ ఉద్యోగాల్లో ఇన్నాళ్లుగా లేని వీఆర్‌ఎస్ విధానాన్నీ కంపెనీలు తెరపైకి తెచ్చాయి. ఉన్నతస్థాయుల్లోని ఉద్యోగుల తొలగింపునకు ఈ సూత్రాన్ని అమలుజేస్తున్నాయి. తాము తొలగించకుండా వారంతట వారే వెళ్లిపోయే ‘చాన్స్’ ఇస్తున్నాయి.
పెద్ద ఉద్యోగులకు వీఆర్‌ఎస్ పేరుతో మర్యాదగా ఉద్వాసన చెబుతున్న సంస్థలు.. చిన్న ఉద్యోగులకు ఆ వెసులుబాటూ ఇవ్వట్లేదు. ‘వెళ్తారా.. లేక వెళ్లగొట్టమంటారా’ అనే ధోరణిలో వార్నింగ్ ఇస్తున్నాయి. ఇన్‌వాలంటరీ అట్రిషన్, వాలంటరీ అట్రిషన్ ద్వారా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నాయి. కంపెనీ మనసును అర్థం చేసుకుంటే.. వాలంటరీ అట్రిషన్. బెట్టు చేసినవారికి ఇన్‌వాలంటరీ అట్రిషన్. రెంటికీ తేడా ఏంటంటే.. తమంత తాము వెళ్లిపోయేవారికి ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్‌తోపాటు, ఇతర బెనిఫిట్స్ అందుతాయి. బెట్టు చేసేవారిన కంపెనీ నేరుగా తొలగిస్తుంది.
ఎవరిని తొలగించాలి అనే అంశంపై ఇప్పుడు చాలా సంస్థల్లో భారీస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా.. నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో ఎక్కువ వేతనం తీసుకునేవారు ఎవరనేది జాబితా సిద్ధం చేస్తారు. వారిలో 50 శాతం పనితీరు బాగా లేనివారు ఉంటారు. వారినే ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంటారు. తర్వాత వారిని తొలగించే వరకు రకరకాల పొరపాట్లను ఎత్తిచూపుతూనే ఉంటారు. తక్కువ జీతాల వారిలో ఆ ప్రాజెక్టును ముందుకు నడిపే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారా లేదా అనేది చూస్తారు. ఉంటే వారినితెరపైకి తెచ్చి సీనియర్లను సాగనంపుతున్నారు.
సాధారణంగా ఐటీ కంపెనీల్లో ఏప్రిల్-మే నెలల్లో జీతాల పెంపు ఉంటుంది. కానీ ఈసారి మే 1 దాటినా ఆ ఊసే లేదు. కొన్ని కంపెనీలు మాత్రం ఈసారి పెంపు లేదని స్పష్టం చేశాయు. మరికొన్ని కంపెనీలు ఇటీవల ఉద్యోగాల్లో చేరినవారు, కొన్ని ర్యాంకుల వారికి హైక్ ఇవ్వబోమని చెప్పాయి. ఇందుకు లాభాలు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయం పెరగడం వంటివి సాకుగా చూపుతున్నాయి. ఉద్యోగుల పనితీరును బట్టి ఏటా 10-15 శాతం ఇంక్రిమెంట్లు ఇచ్చేవి. గత ఏడాది నుంచి ఇది పది శాతం దిగువకు పడిపోయింది. సీనియర్ మేనేజర్లకైతే గత ఏడాది చాలా కంపెనీలు రూపాయి కూడా జీతం పెంచలేదు. ఈ సారి కింది స్థాయి సిబ్బందికీ జీతాల పెంపు అనుమానంగా మారింది. కొన్ని కంపెనీలయితే.. ఉద్యోగులను వెళ్లగొట్టడానికి జీతాలు తగ్గించే మార్గాన్ని అవలంబిస్తున్నాయి. అలాగే.. గతంలో ఐటీకంపెనీలు ఏదో ఒక పేరుతో పార్టీలు ఏర్పాటు చేసేవి.. కొన్ని కంపెనీలు ఏడాదికోసారి ఉద్యోగులకు విహార యాత్ర ఏర్పాటు చేసేవి. గత 3నెలలుగా ఈ తరహా ఖర్చులు ఉండటం లేదు.
దేశీయ ఐటీ సంస్థలు వేలమంది నిపుణులను తొలగిస్తున్నాయనే వార్తలే ఆందోళన కలిగిస్తున్నాయ్.. ఇంతటితో ఇది ఆగలేదని, కొత్త టెక్నాలజీలకు సిద్ధం కాని ఇంజినీర్లను తొలగించడాన్ని మరింత పెద్దఎత్తున ఐటీ సంస్థలు కొనసాగిస్తాయని, ఎగ్జిక్యూటివ్‌ల ఎంపికలో సాయపడే హెడ్‌హంటర్స్ ఇండియా అంటోంది. ‘ఈ ఏడాది ఐటీ సంస్థల్లో 56,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ సంఖ్య 1.75-2.0 లక్షలు ఉంటుంది. మరో మూడేళ్ల పాటూ ఇంతే సంఖ్యలో ఇంజినీర్లు తొలగింపునకు గురవుతారు’ అని హెడ్‌హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 17న నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ సదస్సులో మెకిన్సే అండ్ కంపెనీ ఇచ్చిన నివేదికను విశ్లేషిస్తే ఈ వివరాలు తెలుస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఐటీ సేవల సంస్థల్లో ఉన్న సిబ్బందిలో దాదాపు సగం మంది, రాబోయే 3-4 ఏళ్లలో అప్పటి అవసరాలకు తగినట్లు ఉండరని ఆ నివేదిక పేర్కొంది.
మొత్తానికి ట్రంప్ ఎఫెక్ట్ తో సాఫ్ట్ గా సాగిపోతున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల జీవితాల్లో అలజడి రేగుతోంది. ఉన్నట్టుండి ఉద్యోగం పోతే ఇమ్ ఐ ల పరిస్థితి ఏంటీ అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఇన్నాళ్లూ రాయల్ లైఫ్ తో అడ్డగోలుగా ఖర్చులు చేస్తూ వస్తున్న టెక్కీలు ఆలోచనలో పడ్డారు.
HACK:
- Trump effect on Software companies.
- Bad time for Software employees
- Termination of employment in Cognizant, Infosys, TCS, Wipro.