1969 బాలీవుడ్ సినిమా.. బతుకమ్మ పాట అంట - MicTv.in - Telugu News
mictv telugu

1969 బాలీవుడ్ సినిమా.. బతుకమ్మ పాట అంట

October 24, 2020

బతుకమ్మ పండగ సందర్భంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బాలీవుడ్ పాట తెగ వైరల్‌గా మారింది. ‘బతుకమ్మ.. బతుకమ్మ.. ఎక్కడ పోతావ్ రా… ఎంకన్న ఎంకన్న.. ఇక్కడ రా’ అంటూ సాగే ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ పాపులర్ హిందీ పాట 1969లో వచ్చిన ‘శత్రంజ్’ అనే హిందీ సినిమాలో ఉంది. అమర గాయకుడు మహమ్మద్ రఫీ, శారదా రాజన్ ఈ పాటను ఆలపించారు. సంగీత దర్శక ద్వయం శంకర్-జై కిషన్ ఈ పాటకు బాణీలు అందించారు. శంకర్ హైదరాబాద్ వాసి కావడంతో ఇక్కడి బతుకమ్మ మీద ఆయన పాట చేయగలిగారు. బాలీవుడ్ కమెడియన్ మహమూద్, హెలెన్ ఈ పాటలో నర్తించారు. 

అప్పట్లో ఈ పాట పెళ్లిళ్లలో, బారాత్‌లలో బాగా వినపడేది. కాగా, ఈ పాట మీద కొన్ని విమర్శలు వినబడుతున్నాయి. ఈ పాటతో తెలంగాణ సంస్కృతిని కించపరిచారా? పొగిడారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, బాలీవుడ్ గీతాల్లో తెలుగు పదాలను అప్పట్లో బాగా ఉపయోగించేవారు. సీనియర్ నటుడు రాజ్ కపూర్ నటించిన ‘శ్రీ 420’ సినిమాలోనూ ఓ పాటలో తెలుగు పదాలు వస్తాయి. ‘రామయ్యా వస్తావయ్యా.. రామయ్యా వస్తావయ్యా’ అన్న పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పాటగా మన్ననలు పొందుతోంది. ఈ సినిమాకు కూడా శంకర్-జై కిషన్ ద్వయమే సంగీతం అందించారు.