ఏపీలో బీ ఫార్మసీ చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు సోమవారం దుర్మరణం పాలయ్యారు. బీచ్‌కి వెళ్లి సరదాగా గుడుపుతున్న వారిని మృత్యువు అలల రూపంలో కబళించింది. కాపాడాలని పోలీసులు ప్రయత్నించినా విధి సహకరించలేదు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్ధినులను ప్రమీల, పూజితలుగా గుర్తించారు.
వీరిద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు కాలేజీలో స్టూడెంట్స్ అని పోలీసుల విచారణలో తేలింది. సరదాగా గడిపేందుకు సమీపంలోని మంగినపూడి బీచ్‌కు వెళ్లగా.. నీళ్లలోకి దిగిన ఇద్దరినీ అలలు లోపలికి లాక్కెళ్లాయి. గమనించిన చుట్టుపక్కల వారు మెరైన్ పోలీసులకు సమాచారమందించారు. వారు వచ్చి సముద్రంలోకి వెళ్లి విద్యార్ధినులను బయటికి తీసుకువచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్ధినులు.. కాసేపటికే తుది శ్వాస విడిచారు. కాగా, ఈ మరణవార్తను వారి తల్లిదండ్రులను చేరవేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.