భారత బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధు టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ మన్నె రత్నాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురించి తప్పుడు కథనాలు రాస్తున్నాడని రత్నాకర్‌పై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తన కుటుంబంతో తనకు గొడవ అయిందని అందుకే లండన్ వచ్చానని రత్నాకర్ తప్పుడు వార్తలు రాస్తున్నాడని ఆమె మండిపడ్డారు. మొట్టమొదటిసారి తన తల్లిదండ్రులతో కాకుండా ఒంటరిగా విదేశాలకు వెళ్లిందని రత్నాకర్ ఓ కథనం రాశాడు. మరో రెండు నెలలు ఆమె అక్కడే ఉంటుందని అందులో తెలిపాడు. కుటుంబంలో గొడవలు జరగడంతో ఆమె లండన్ వెళ్లిందని రాసుకొచ్చాడు. ఇంగ్లండ్ టీమ్‌తో కలిసి ఆమె అక్కడే ప్రాక్టీసును మొదలు పెట్టనుందని, ఆమెను తిరిగి ఇంటికి రప్పించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాడు.
I came to London a few days back to work on my nutrtion and recovery needs with GSSI. Infact I have come here with the consent of my parents and absolutely they were no family rifts in this regard. pic.twitter.com/zQb81XnP88
— Pvsindhu (@Pvsindhu1) October 20, 2020
దీనిపై పీవీ సింధు స్పందిస్తూ.. ఫిట్‌నెస్‌లో భాగంగా న్యూట్రిషన్ కోసం లండన్‌కు వచ్చానని, నిజానికి తన తల్లిదండ్రుల అనుమతితోనే వచ్చానని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో వారితో ఎటువంటి గొడవలూ లేవని తెలిపారు. ‘నాకోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులతో నాకు గొడవలు ఎందుకు ఉంటాయి? నా కుటుంబంతో నేను చాలా ప్రేమతో ఉంటాను. వారు నన్ను ఎల్లప్పుడు ప్రేమిస్తునే ఉంటారు. రోజూ నేను వారితో మాట్లాడతాను. నాకు నా కోచ్ పుల్లెల గోపిచంద్ తోనూ, ఆయన శిక్షణ సంస్థతోనూ ఎటువంటి సమస్యలు లేవు. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ రిపోర్టర్ ఎం రత్నాకర్ నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇటువంటి వార్తలు రాసేటప్పుడు నిజాలు ఏంటో తెలుసుకుని రాయాలి. అతడు ఇటువంటి చర్యలను మానుకోకపోతే నేను అతడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడను’ అని పీవీ సింధు ట్వీట్లో పేర్కొంది. ఈ వివాదంలో నెటిజన్లు సింధూ తరపున నిలుస్తున్నారు. తప్పుడు వార్తలు రాస్తున్న రత్నాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.