Badu gave birth three sons at a time in rajasthan
mictv telugu

ఒకటి అడిగితే మూడు ఇచ్చిన దేవుడు.. అసలు ఆట ఇప్పుడుంది

December 21, 2022

Badu gave birth three sons at a time in rajasthan

ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్న దంపతులకు వంశోద్ధారకుడు కావాలనే కోరిక పుట్టింది. అందుకోసం మరో కాన్పు కోసం ప్రయత్నించగా, కనికరించిన దేవుడు ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలను ఇచ్చాడు. ఇప్పుడు సదరు దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలతో దేవుడు సమం చేశాడని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు సంతోషించారు. కానీ అసలు ఆట ఇక్కడే మొదలైంది. భర్త సంపాదన అంతంత మాత్రమే కావడంతో వారిని పోషించడం కష్టమైపోతోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం ఉంది. నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెత ఉన్నా.. ఈ ఆధునిక కాలంలో తగినంత ఆదాయం లేకపోతే పిల్లలను పెంచడం కష్టమనే భావన ఇప్పుడు వారిలో నెలకొంది. ఈ సంఘటన రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లా సగ్వాడ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక మగపిల్లాడు కావాలనే ఆశ బడు, జయంతిలాల్ దంపతులను మరింత పేదరికంలో నెట్టింది. నవంబర్ 26న పుట్టిన ముగ్గురు పిల్లలు నెలలు నిండకుండా పుట్టడంతో 25 రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక డిశ్చార్జి చేశారు. ఇప్పుడు ఆరుగురు పిల్లలను సాకడానికి జయంతిలాల్ నానా పాట్లు పడుతున్నాడు. కోరి కోరి కన్న కొడుకులను చూసి మురిసిపోవాలో లేక వారిని పోషించడమెలా అని బాధపడాలో అర్ధం కాని అయోమయంలో ఉన్నాడు.