కొత్త టెక్నాలజీతో పొరుగుదేశం చైనా వాహన రంగంలో దూసుకెళ్తోంది. ఆ దేశానికి చెందిన టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘బైడూ’ కంపెనీ కొత్త తరహా కారును రూపొందించింది. స్టీరింగ్ లేని పూర్తి స్వయం చోదక సత్తా ఉన్న ‘అపోలో ఆర్టీ6’ మోడల్‌ను ఆవిష్కరించింది. ఒక్కో కారు 37 వేల డాలర్లు (రూ. 29 లక్షల 57 వేలు)ఖరీదు ఉండే ఈ వాహనాన్ని మొదటగా వచ్చే ఏడాది బైడూ రైడ్ సర్వీసులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కారు ప్రవేశంతో ప్రపంచవ్యాప్తంగా అటానమస్ వాహన పరిశ్రమ పరుగులు పెడుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇలాంటి డ్రైవర్ లేని కార్లు అందుబాటులోకి వస్తే ట్యాక్సీ రెంటల్ ధర కూడా భారీగా తగ్గుతుందని కంపెనీ వెల్లడించింది. స్టీరింగ్ లేని కారణంగా ఇంకా అదనంగా ప్రత్యేక ఫీచర్లను జోడించవచ్చని బైడూ తెలిపింది. దీనితోపాటు 38 సెన్సార్లు అమర్చి, 32 మిలియన్ కిలోమీటర్ల రియల్ డ్రైవింగ్ అనుభవాన్ని ఈ మోడల్లో పొందుపర్చారు. అంటే ఓ డ్రైవరు 20 ఏళ్ల అనుభవాన్ని కారు సిస్టంలో అప్లోడ్ చేశారన్నమాట. కాగా, ఇప్పటికే ఇలాంటి కార్లతో 2020లో చైనాలోని 10 నగరాల్లో రోబో ట్యాక్సీలను బైడూ కంపెనీ ప్రారంభించింది. ఇప్పుడు తాజా మోడల్ రాకతో కారుకు పెట్టుబడులు తగ్గడంతో పాటు కారు రెంటుకు తీసుకునే వినియోగదారులకు కూడా తక్కువ ధరకు అందుబాటులో వస్తుందని బైడూ కంపెనీ అభిప్రాయపడింది.