కూతురు హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకి బెయిల్ - MicTv.in - Telugu News
mictv telugu

కూతురు హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకి బెయిల్

May 18, 2022

 

కూతురు షీనా బోరా తన భర్త మొదటి భార్య కుమారుడితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న కారణంగా కోపంతో హత్య చేసిన కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియాకి బెయిల్ మంజూరైంది. సుమారు ఆరున్నరేళ్ల కస్టడీ తర్వాత ఆమెకు బుధవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంద్రాణి మాజీ మూడో భర్త పీటర్ ముఖర్జియాకు విధించిన బెయిల్ షరతులే ఈమెకు కూడా వర్తిస్తాయని వెల్లడించింది. ఇంద్రాణి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. గత 11 నెలలుగా విచారణలో ఎలాంటి పురోగతి లేదని, ఇంద్రాణికి కనీం పెరోల్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదన్న కారణాలతో సెక్షన్ 437 కింద బెయిల్ మంజూరుకు అభ్యర్ధించారు. దాంతో సుప్రీం కోర్టు పై నిర్ణయం తీసుకుంది. కాగా, షీనా బోరా ఇంద్రాణికి మొదటి భర్త ద్వారా జన్మించింది. కూతురితో పాటు కొడుకు కూడా ఉన్నాడు. అయితే మొదటి భర్తతో విడాకులు తీసుకొని పిల్లలిద్దరినీ తన తల్లి ఇంట్లో ఉంచింది. అనంతరం ముంబైకి వెళ్లగా అక్కడ సంజీవ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది ఇంద్రాణి.

కొన్నేళ్లకు అతడికి కూడా విడాకులిచ్చి పీటర్ ముఖర్జియా అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. ఈ లోపు పెరిగి పెద్దదయిన షీనా బోరా తల్లిని కలుసుకునేందుకు ముంబైకి వచ్చింది. అయితే తనకు ఇద్దరు పిల్లలున్న సంగతి మూడో భర్త వద్ద దాచిన ఇంద్రాణి, కూతురు షీనా బోరాను తన చెల్లెలుగా పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్‌కు మొదటి భార్య ద్వారా పుట్టిన కుమారుడు రాహుల్ ముఖర్జియాతో షీనా బోరా డేటింగ్ చేస్తుండేది. దీంతో ఆగ్రహించిన ఇంద్రాణి పద్దతి మార్చుకోమని కూతురిని హెచ్చరించింది. షీనా బోరా తల్లి హెచ్చరికలను పట్టించుకోకుండా అసలు విషయం పీటర్ ముఖర్జియాతో చెప్పేస్తానని తల్లిని బెదిరించింది. దీంతో ఆగ్రహం చెందిన ఇంద్రాణి.. కూతురిని హతమార్చాలనుకొని తన మాజీ రెండో భర్త సంజీవ సహాయం కోరింది. ఆయన తన డ్రైవరు శ్యాంతో కలిసి 2012లో షీనాను హత్య చేశారు. ఈ విషయం శ్యామ్ ఒక కేసులో పోలీసులకు పట్టుబడడంతో పోలీసులు విచారించగా, షీనా బోరా హత్య ఉదంతం బయటపడింది. దాంతో లోతుగా విచారించిన పోలీసులు డ్రైవరు శ్యాంతో పాటు సంజీవ, ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాలను అరెస్ట్ చేశారు.