తెలంగాణలో దుమారం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశం రాజకీయంగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికీ మాటల యుద్ధానికి దిగుతుంటాయి. ఈ కేసులో దర్యాప్తు కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయగా, కేసును సీబీఐకి బదిలీ చేయాలని నిందితుల తరపున హైకోర్టులో పిటిషన్లు, వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితుల్లో ఒకరైన సింహయాజీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఓకే చెప్పేసింది. ఇక మిగిలిన ఇద్దరు నిందితులకు కూడా తాజాగా బెయిల్ లభించింది. బుధవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఏ1 రామచంద్రభారతితో పాటు ఏ2 నందకుమార్ లు రూ. 6 లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరు గురువారం చంచల్ గూడ జైలు నుంచి విడుదలవుతారు.