అయ్యప్ప స్వామిని దూషించి వార్తలకెక్కిన నాస్తికుడు బైరి నరేశ్‌పై మళ్లీ దాడి జరిగింది. సోమవారం హన్మకొండలోని గోపాల్‌పూర్ ప్రాంతంలో అతనిపై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. పోలీసుల ఎస్కార్ట్ వాహనంలో వెళ్తున్న నరేశ్‌ను కిందికి లాగి కొట్టారు. పోలీసులు అతణ్ని తీసుకొస్తున్నారని పక్కా సమాచారం అందడంతో మాటుకాచి దాడి చేశారు. నరేశ్ అయ్యప్ప స్వామి పుట్టుకను గేలిచేస్తూ మాట్లాడ్డం, కొందరు కేసు పెట్టడంతో జైలుకు వెళ్లడం తెలిసిందే. జైల్లో 45 రోజులు గడిపి బయటి వచ్చాక కూడా పలు టీవీ ఇంటర్వ్యూల్లో ఆయన అయ్యప్పపై, పుట్టపర్తి సాయిబాబాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బైరి నరేశ్‌పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. భక్తుల మనోభావాలు గాయపరుస్తున్నాడని పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. సభలు, సమావేశాల్లో అతడు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నిర్వాహకులు కట్టడి చేయాలని కోరారు. లేకపోతే వారిపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.