బజాజ్ ఆటో యూనిట్‌లో 250 మందికి కరోనా.. కంపెనీని మూసివేయాలని.. - MicTv.in - Telugu News
mictv telugu

బజాజ్ ఆటో యూనిట్‌లో 250 మందికి కరోనా.. కంపెనీని మూసివేయాలని..

July 4, 2020

Maharashtra

మహారాష్ట్రలోని వలూజ్‌లో ఉన్న బజాజ్ ఆటో యూనిట్‌లో కరోనా తీవ్ర కలకలం రేపింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 250 మంది ఉద్యోగులకు సోకింది. దీంతో ఒక్కసారిగా ప్లాంట్‌లో కలకలం రేగింది. మొత్తం 8 వేల మంది పనిచేస్తున్న ఈ యూనిట్‌లో 140 మంది కరోనా బారినపడినట్టు జూన్ 26న కంపెనీ వెల్లడించింది. అయితే పని ఆపేది లేదని.. వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని కంపెనీ కోరుకుంటోందని తెలిపింది. తాజాగా కంపెనీలో కరోనా బారినపడిన వారి సంఖ్య 250కి పైనేనని ఔరంగాబాద్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. కంపెనీని 10-15 రోజుల పాటు తాత్కాలికంగా మూసి వేయాలని కోరుతున్నట్టు బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగాడె బాజీరావు తెలిపారు. కరోనా వైరస్‌ చైన్‌ను తెంచాలంటే మూయక తప్పదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేయాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులున్న పశ్చిమ మహారాష్ట్రలో ఈ యూనిట్ ఉంది. ఇదిలావుండగా విధులకు హాజరు కానివారికి డబ్బులు చెల్లించబోమని ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ పేర్కొంది. కార్మికులు విధులకు రావాలంటే భయపడుతున్నారని, కొందరు వస్తున్నా.. మరికొందరు సెలవు తీసుకుంటున్నట్టు బాజీరావు తెలిపారు.