జమ్ముకశ్మీర్లో చొరబడి ప్రజల ప్రాణాలు తీయడానికి వచ్చిన ఉగ్రవాదులను ఓ పౌరుడు ప్రాణాలకు తెగించి తరిమికొట్టాడు. దీని వల్ల 45 మంది ప్రాణాలను కాపాడగలిగాడు. ఈ నెల 1వ తేదీన రాజౌరి జిల్లా డాంగ్రీ గ్రామంలో ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుశ్చర్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న గ్రామ డిఫెన్స్ కమిటీ సభ్యుడు బాల క్రిషన్ బుధవారం ఘటన గురించి వివరించాడు. ‘ఉగ్రవాదులు మొదట ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. ఆరుగురిని చంపేశారు. దీంతో నేను అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపాను. వారు పారిపోతుండగా నేను కొంత దూరం వెంబడించాను. ఆ రోజు నేను తెగించకపోతే సుమారు 40 నుంచి 45 మందిని ఉగ్రవాదులు చంపేసేవారు. అయితే నేను సిద్ధంగా లేకపోవడం వల్ల ఎక్కువ దూరం వెంబడించలేకపోయాన. ఇప్పటికైనా తమ గ్రామానికి, పరిసర గ్రామాలకు ప్రధాని నరేంద్రమోదీ సరైన రక్షణ కల్పించి మా ప్రాణాలకు భద్రత కల్పించాలని మనవి చేస్తున్నా’నని వెల్లడించారు. కాగా, లోయలో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతుండడంతో స్పందించిన కేంద్రం 1800 అదనపు సైన్యాన్ని పంపించింది.