‘బలగం’ క్లైమాక్స్ రిపీట్… కాకి ముట్టలేదని ఏం చేశారంటే..
తెలంగాణ సంసృతి, సాంప్రదాయాల ఇతివృత్తంగా.. గ్రామాల్లోని జీవన శైలి నేపథ్యంలో ఇటీవల వచ్చిన సినిమా బలగం. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చూసాకా.. చాలా ఊళ్లల్లో విడిపోయిన అన్నదమ్ములు కలిసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఊరురా.. ఊరు మొత్తం ఈ సినిమా చూసి కంటతడి పెట్టుకున్న ఘటనలు జరిగాయి. పెద్దవారు చనిపోయాకా పిట్టకు పెట్టే ఆనవాయితీ ప్రతి తెలుగు కుటుంబంలో ఉంటుంది. ఇక తాజాగా ఒక కుటుంబం..బలగం సినిమాలో కనుక కాకి అన్నం ముట్టకపోతే ఇష్టమైనవి పెట్టినట్లు.. వీరు కూడా తండ్రి చనిపోయాక కాకి అన్నం ముట్టకపోవడంతో తన తండ్రికి నచ్చినవి పెట్టి చూపరులను ఆకర్షించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో పూదరి వెంకటరాజ్యం గౌడ్(80) అనే వృద్దుడు 5 రోజుల క్రితం మరణించాడు. అతనికి ముగ్గురు కొడుకులు. చనిపోయి 5 రోజులు కావస్తుండడంతో కుటుంబ సభ్యులు పిట్టకు పెట్టే కార్యక్రమం చేశారు. ఆయనకు ఇష్టమైన వంటకాలను చేసి.. కుటుంబం మొత్తం కాకి కోసం ఎదురుచూశారు. కానీ, కాకి రాలేదు. ఇక అప్పుడే వీరికి బలగం సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో తాతకు నచ్చిన ఫోటో పెట్టి కుటుంబం మొత్తం వచ్చి నిలబడగానే కాకి అన్నం ముడుతుంది. ఇదే తీరులో వెంకటరాజు గౌడ్ కు ఇష్టమైన ఆహార పదార్థాలను తీసుకొచ్చి పళ్లెంలో పెట్టారు. అయినా కాకి ముట్టలేదు. ఈసారి ఆయనకు ఇష్టమైన వంటకాలతో పాటు పేక ముక్కలను, రూ. 10 నోటును పళ్లెంలో పెట్టారు. ఇలా చేస్తే తండ్రి ఆత్మ శాంతిస్తుందని భావించిన ఆ కుటుంబ సభ్యుల నమ్మకం నిజమైంది. ఎట్టకేలకూ కాకి ముట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.