కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం కావడం, ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్మీడియాలో వైరల్ కావడం, రిలీజుకు ముందే ప్రీమియర్ షోలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో బలగం మూవీపై మంచి అంచనాలేర్పడ్డాయి. మరి బలగం మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోగలిగింది? తెరపై ఎంతలా అలరించగలిగింది?
కథ విషయానికొస్తే..
తెలంగాణలోని ఓ పల్లెటూర్లో ఉండే సాయిలు (ప్రియదర్శి)కి పెళ్లి కుదురుతుంది. వచ్చే కట్నం డబ్బులతో తన అప్పులన్నీ తీర్చేయాలనుకుంటాడు సాయిలు. కానీ పెళ్లికి ముందే సాయిలు తాత కొమురయ్య (సుధాకర్ రెడ్డి) హఠాత్తుగా చనిపోతాడు. కొమురయ్యకి పెట్టిన పిండం కాకులు ముట్టవు. దాంతో అక్కడినుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. అసలు సాయిలుకి అంతలా అప్పులెందుకయ్యాయి? కొమురయ్య పిండాన్ని కాకులు ఎందుకు తినలేదు? చివరకు ఏం చేస్తే కాకులు పిండం ముట్టాయి? అనేదే సినిమాలో ప్రధాన కథ.
కథనం ఎలా ఉందంటే..
బతుకు గురించి చావు నేపథ్యంతో ఓ కథ రాసి సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించడమంటే చిన్న విషయం కాదు. డైరెక్టర్ వేణు ఆ విషయంలో సక్సెసయ్యాడనే చెప్పాలి. సినిమా ఓ పల్లెటూరి పాటతో మొదలవడంతోనే ఆ ప్రపంచంలోకెళ్లిపోతారు ప్రేక్షకులు. ఇక ఫస్టాఫంతా సరదాగా సాగుతూనే, సెకండాఫ్ పూర్తి ఎమోషనల్ గా నడుస్తుంది. క్లైమాక్స్ కట్టిపడేస్తుంది. చనిపోయిన వాళ్లకి పిండం ఎందుకు పెట్టాలి? దాన్ని కాకే ఎందుకు ముట్టాలి? ఆ తంతు వెనకున్న ఆంతర్యమేంటి? అని ఇప్పటి తరానికి కూడా చక్కగా చెప్తూ రాసుకున్న సీన్లు బాగున్నాయి. చావు నేపథ్యంతో నడిచే కథ కావడంతో చాలా చోట్ల కన్నడ మూవీ తిథి గుర్తుకురానమానదు. దిల్ రాజు
ఎవరెలా చేశారంటే..
అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ వేణు గురించే. కమెడియన్ గా మాత్రమే జనాలకి సుపరిచితుడైన వేణు ఓ పల్లెటూరి కథని ఇంత హృద్యంగా తెరకెక్కించగలడా? అన్న సందేహాన్ని పటా పంచాలు చేశాడు. ఇక హీరోగా ప్రియదర్శి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ ప్రాంత యాస, భాష నేపథ్యంతో కథ రాస్తే నటుడిగా ఎంతలా ఓన్ చేసుకుని పాత్రని తెరపై పండిస్తాడో తెలిసిందే. చాలా సహజంగా తన నటనతో ప్రేక్షకులని కట్టిపడేశాడు. ఇక హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఆడియెన్సుకు పరిచయమే అయినా, మసూదతో హీరోయిన్ గా మారింది. రెండో చిత్రంగా బలగం మూవీతో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా చక్కగా నటించింది. గతంలో కొత్త పోరడు సిరీసులో ఇస్తారయ్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ రెడ్డి ఈ మూవీలో కొమురయ్యగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. పల్లెటూరి అందాలతో పాటు, నేటివిటీని ప్రజెంట్ చేయడంలో ఆచార్య వేణు సినిమాటోగ్రాఫీ పనితనం చాలాచోట్ల కనిపించింది. భీమ్స్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. సినిమా విడుదలకి ముందే వినిపించిన పాటలు ఒకెత్తయితే, మూవీలో నేపథ్య సంగీతం, ఎమోషనల్ సీన్లలో వచ్చే మ్యూజిక్ ఒకెత్తు. చిన్న సినిమా అయినా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. మురళీధర్ గౌడ్, రూప, జయరామ్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రల్లో ఎవరి రోల్స్ కి వాళ్లు న్యాయం చేశారు.
ఓవరాల్ గా ఎలా ఉందంటే..
భారీ యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లు, కోట్ల ఖర్చుతో వేసే గ్రాండియర్ సెట్లు లేకుండా సున్నితమైన కథతో బంధాల విలువను తెలియజేస్తూ భావోద్వేగాలను పండించే ఓ పల్లెటూరి కథను చూడాలనుకుంటే చక్కగా బలగం మూవీ చూసేయొచ్చు.