వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని ఇంటర్వ్యూలో దేవాంగుల కులం గురించి పలు వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. దీనిని వ్యతిరేకిస్తూ… చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దేవాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని దేవబ్రాహ్మాణులు సీరియస్ అయ్యారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణలోని దేవాంగులు దీనిపై సీరియస్ అయ్యారు. పలువురు నాయకులు బాలకృష్ణని విమర్శించారు. క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు కూడా.
From the desk of Actor & Leader Nandamuri Balakrishna Garu#NandamuriBalakrishna pic.twitter.com/FbnqeOK4yA
— Vamsi Kaka (@vamsikaka) January 15, 2023
తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అనేది తప్పుడు సమాచారం అని అన్నారు. అది దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని చెప్పారు. తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్టుగా కోరారు. ఈ ప్రెస్ నోట్ లో.. “దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే…
అంతేకానీ సాటిసోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు, నా వాళ్లను నేను బాధపెట్టుకుంటానా?. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను.. ఇట్లు మీ బాలకృష్ణ” అని రాశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.