సినిమా షూటింగులపై ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. లాక్‌డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చి షూటింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. చిరంజీవి నేతృత్వంలో కొంత మంది హీరోలు, దర్శక నిర్మాతలు సమావేశమయ్యారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తోనూ చర్చించారు. ఈ భేటీపై హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల విషయం తనకు తెలియదని తేల్చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళ్లు అర్పించిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధమైన సమాధానం చెప్పారు.
ప్రభుత్వంతో సినీ ప్రముఖులు చర్చలు జరిపిన విషయం తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తనకు ఈ సమాచారం అందిందని అన్నారు. ఏం చర్చించారనేది తనకు తెలియనది స్పష్టం చేశారు. లాక్ డౌన్ కాలంలో సినీ పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కుందని చెప్పారు. తనను కూడా కొంత మంది సలహాలు అడిగితే ఇచ్చానని, అంతకు మించి ఏమి తెలియదన్నారు. షూటింగ్స్ ప్రారంభం అయితే మంచిదేనని అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని వెల్లడించారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.