సినిమా హీరోలకు , హీరోయిన్లకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ తమ ఫేవరేట్ స్టార్స్ కోసం ఏమైనా చేసేందుకు రెడీ అయిపోతారు. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు సినిమా థియేటర్ల వద్ద అభిమానులు చేసే గోల ఓ రేంజ్లో ఉంటుంది. భారీ కటౌట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇంకొంతమంది ఫ్యాన్స్ వారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా రక్తదానం, అన్నదానం వంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రం తమ అభిమానాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. ఏకంగా బలయ్య కోసం మూడేళ్లు పెళ్లి వాయిదా వేశాడు ఓ వీరాభిమాని. బాలయ్య వస్తే కానీ పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు. ఈ అభిమాని తీరును చూసి అందరూ అవాక్కవుతున్నారు.
విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన కోమలి పెద్దనాయుడు బాలయ్యకు వీరాభిమాని. పెద్దనాయుడికి 2019లో గౌతమి ప్రియ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యింది. బాలయ్య ఫ్యాన్ కావడంతో పెద్దనాయుడు తన పెళ్లికి రావాలని బాలయ్య బాబును, వైజాగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఆహ్వానించాడు. అయితే బాలయ్య బిజీగా ఉండటంతో పెళ్లికి రాలేకపోయారు. ఆ తరువాత కరోనా లాక్డౌన్ రావడంతో పెళ్లి ప్రయత్నాలు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. తాజాగా మరోసారి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు పెద్దనాయుడు. బలయ్యకు పెళ్లి కార్డును పంపి మరోసారి ఆహ్వానించాడు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఊరంతా సిద్ధమవుతోంది. ఎందుకంటే ఊరు ఊరంతా బాలయ్య బాబు అభిమానులేనట. పెద్దనాయుడే కాదు అతను చేసుకోబోయే అమ్మాయి కూడా బాలయ్య ఫ్యానే. దీంతో ఈ సారరైనా తమ పెళ్లికి బాలయ్య బాబు వస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాడు ఈ అభిమాని.