టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాసేపటి క్రితమే సంచలన ప్రకటన చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాన్ని ప్రపంచం నలుమూలాల వ్యాప్తి చేస్తామని, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. గుంటూరులోని జేకేసీ రోడ్డులో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను బాలకృష్ణ ప్రారంభించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనేదే ఎన్టీఆర్ ఆశయం. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గతంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. రాజకీయ ఉద్దేశంతోనే వైసీపీ సర్కారు అన్న క్యాంటీన్లను రద్దు చేసింది. ప్రభుత్వ దుర్మార్గాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయి. వైసీపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆ ప్రభావమే ఇప్పుడు పన్నుల రూపంలో ప్రజలపై పెను భారం పడింది. త్వరలోనే ఈ అన్న క్యాంటీన్లు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం” అని ఆయన అన్నారు.
తాజాగా బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపూరంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి, కేవలం రెండు రూపాయలకు ఏడాది పొడవునా భోజనాన్ని అందించనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మొబైల్ క్యాంటీన్‌ను ఓపెన్ చేశారు. ”గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా, రెండు రూపాయలకు బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం స్పూర్తితో అన్న క్యాంటీన్లో రెండు రూపాయలకు నాణ్యమైన భోజన పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం” ఆమె అన్నారు. ఇప్పుడు ఆమె భర్త బాలకృష్ణ ఈ అన్న క్యాంటీన్లు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సంచలనంగా మారింది.