బాలయ్య చిన్నల్లుడు.. విశాఖ నుంచి లోక్ సభకు పోటీ.. - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య చిన్నల్లుడు.. విశాఖ నుంచి లోక్ సభకు పోటీ..

September 27, 2018

వంశపారంపర్య రాజకీయాల్లో అన్ని పార్టీలూ దొందూదొందే. ఒకప్పుడు కాంగ్రెస్‌ది వంశపాలన అంటూ తిట్టిపోసిన పార్టీలు కూడా దాని బాటలోనే నడుస్తున్నాయి. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లో కొడుకులూ, కూతుళ్లు, అల్లుళ్లు, వేళ్లు విడిచిన, కాళ్లు విడిచిన బంధువులు చట్టసభల్లోకి, పార్టీ పదవుల్లోకి దూసుకొస్తున్నారు. కాంగ్రెస్ వంశపాలనను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీలో మరో వారసుడు అరంగేట్రానికి రెడీగా ఉన్నాడు.

ERR

నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ వచ్చే ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాడని పార్టీ వర్గాలు చెప్పాయి. బాలయ్య పెద్దల్లుడు మంత్రి నారా లోకేశ్ బాబు ప్రస్తుతం ఎమ్మెల్సీ కాగా, అతడు కూడా వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు.తోడల్లుడి బాటలో తాను కూడా రాజకీయాల్లోకి రావాలని భరత్ కొన్నాళ్లుగా ఆలోచిస్తున్నాడు. తనకు కూడా బలమైన రాజకీయ నేపథ్యముందని, తగిన అర్హతలన్నీ ఉన్నాయని అతడు చెబుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

భరత్ విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు. తాత బాటలో తాను కూడా విశాఖ నుంచే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని భరత్ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. విశాఖ సీటును గత ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టిన బీజేపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీల పొత్తు చెరిగిపోవడంతో భరత్‌కు మార్గం సులువైందంటున్నారు. టీడీపీని మొత్తం తన అధీనంలోకి తీసుకున్నానన్న అపప్రథను పోగొట్టుకోవడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని, అందులో భాగంగా నందమూరి వారసులకు పీట వేయడానికి భరత్‌కు టికెటివ్వాలని యోచిస్తున్నారని చెబుతున్నారు. హరికృష్ణ కుటుంబం నుంచి ఇప్పట్లో రాజకీయ వారసులు రాబోరని, ఆలోపు భరత్‌తో ప్రయోగం చేస్తారని అంటున్నారు. అయితే దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకున్న తమకు కాకుండా భరత్‌కు టికెటిస్తే చూస్తూ ఊరుకోబోమని స్థానిక నేతలు ఇప్పటికే బెదిరింపులు మొదలుపెట్టారట.