పవర్ ఫుల్ పంచులు లేకుండా స్టార్ హీరోల సినిమాలని ఊహించలేం. విలన్ పై అద్దిరిపోయే డైలాగ్స్ ఉంటేనే హీరోయిజం పండుతుంది. ఇలాంటి డైలాగ్స్ బాలయ్య నోటి నుండి వింటే ఆ మజానే వేరు. గుక్క తిప్పకుండా బాలకృష్ణ చెప్పే ఊర మాస్ డైలాగ్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పడతాయి. అందుకే కథకి సంబంధం లేకుండా బాలయ్య కోసం సపరేట్ డైలాగ్స్ రాయిస్తారు మేకర్స్. ఫైట్ కి ముందు ఒక డైలాగ్.. ఫైట్ అయ్యాక మరో డైలాగ్ ఉంటేనే బాలయ్య యాక్షన్ సీన్ నిండుగా ఉంటుంది. సమరసింహారెడ్డితో పరుచూరి బ్రదర్స్ మొదలు పెట్టిన ఈ ట్రెండ్ ని బోయపాటి పీక్స్ కి తీసుకెళ్లాడు. సింహ, లెజెండ్, అఖండలో డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అయితే సింహని వదిలేస్తే.. లెజెండ్, అఖండలో ఒకింత లైన్ క్రాస్ చేసి మరి డైలాగ్స్ ఉంటాయి. రాజకీయ నాయకులని టార్గెట్ చేస్తూ ఎవర్నో ఉద్దేశపూర్వకంగా తిడుతున్నట్టు బాలయ్య డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదే తరహా డైలాగ్స్ వీరసింహారెడ్డిలోను ఎక్కువగా ఉన్నాయని టాక్ బయటికొస్తుంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా.. పెద్ద ఎత్తున కించపరిచే డైలాగ్స్ బాలయ్య చెప్పాడని.. టీడీపీ ఫ్యాన్స్ ఈ డైలాగ్స్ కి కేకలు వేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవిధంగా ఉండటంతో.. వైసీపీ, జగన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గుస్సా అవుతున్నారు. అప్పట్లో ప్రభుత్వాల తీరుపై ఇండైరెక్ట్ గా ఒకటి అరా డైలాగ్ లు ఉండేవి తప్పా సినిమా ఆధ్యంతం తిడుతూనే ఉండటం అస్సలు బాలేదని వైసీపీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సినిమాలో పనిగట్టుకుని మమ్మల్ని టార్గెట్ చేస్తే.. మేము బయట మిమ్మల్ని టార్గెట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకులు జగన్ గవర్నమెంట్ మీద ప్రధానంగా చేసే ఆరోపణలు, టీడీపీ అనుకూల మీడియాలో చేసే డిబేట్స్ తరహాలోనే డైలాగ్స్ ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పేరు మార్పు గురించి బాలయ్య పేల్చిన పంచ్ లు.. ఎన్టీఆర్ వర్సీటీ పేరు మార్పు విషయంలో జరిగిన రగడని గుర్తు చేస్తున్నాయంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఒక రాజకీయ సభ మాదిరి సినిమాలు కూడా ప్రత్యర్థులపై చేసే విమర్శలకు వేదికవ్వటం గమనార్హం.