నందమూరి తారకరత్న అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్థం నేడు సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్లో తారకరత్న పార్థివదేహాన్ని ఉంచుతారు. మోకిలాలోని సొంతింట్లో ఆఖరి క్రతువు పూర్తిచేశారు కుటుంబసభ్యులు.
తారక రత్న మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. చిన్న వయుస్సులో తారకరత్న మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కన్నీటి పర్యంతం అవుతున్నారు. భర్త భౌతికకాయాన్ని చూస్తూ గుండె పగిలేలా రోదిస్తున్నారు.పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి వెళ్లి కన్నీటితో నివాళి అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి బాలకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తారకరత్న అంటే బాలకృష్ణ ఎనలేని ప్రేమ. ఆయన గుండెపోటుతో కుప్పకూలిన నుంచి కేసీ ఆస్పత్రిలో చేర్పించే వరకు ఆయనే అన్ని దగ్గరుండి చూసుకున్నారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడే ఉండి డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకునేవారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు చాలా ప్రయత్నించారు. విదేశాల నుంచి వైద్యులను రప్పించారు. తారకరత్నను రక్షించేందుకు బాలయ్య తమ వంతు ప్రయత్నాలు చేశారు. తొందరగా కోలుకోవాలని చిత్తూరు జల్లాలో ఉన్న మృత్యుంజయ స్వామి ఆలయంలో 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగించే కార్యక్రమం చేపట్టారు. చివరికి అన్ని ప్రయత్నాలు విఫలం చెంది తారకరత్న చనిపోవడాన్ని బాలయ్య తట్టుకోలేకపోతున్నారు.
తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాలయ్య మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముగ్గురు పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటానని చెప్పినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాకు తెలిపారు. తారకరత్న, అలేఖ్యారెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.