బాల‌కృష్ణుడు @1990 - MicTv.in - Telugu News
mictv telugu

బాల‌కృష్ణుడు @1990

November 24, 2017

అంద‌రికి తెలిసిన ఓ క‌థ‌ను తెర‌పై కొత్త‌గా చెప్ప‌డం అనేది  ఓ క‌ళ‌. ఈ ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంత‌ం కావాలంటే పేరున్న న‌టీన‌టులు, డ‌బ్బుపెట్టే  నిర్మాత‌లు, స్టార్ క‌మెడీయ‌న్‌లు ఉంటే స‌రిపోతుంద‌ని అనుకుంటే పొర‌పాటే.  ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల అభిరుచుల్ని తెలుసుకోవ‌డం  చాలా ముఖ్యం. పాత క‌థ‌ల‌కు ఆద‌ర‌ణ ఉందా?  ప్ర‌స్తుతం ప్రేక్ష‌కులు ఎలాంటి కామెడీని ఇష్ట‌ప‌డుతున్నారు? ఇలా ఎన్నో అంశాల‌ను లోతుగాఆధ్యాయ‌నం చేయాలి. అంతేకానీ  పాత స‌క్సెస్ ఫార్ములాల‌ను గుడ్డిగాన‌మ్మి ఫాలో అయితే చివ‌ర‌కు ఏమీ మిగ‌ల‌దు. ‘బాల‌కృష్టుడు’ విష‌యంలో ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ మ‌ల్లెల అదే చేశారు.తెలుగు కథానాయకుల్లో నారా రోహిత్ పంథా విభిన్నం.  స్టార్‌డమ్, ఇమేజ్‌లను ఆశించకుండా కెరీర్ తొలినాళ్ల నుంచి నవ్యమైన కథాంశాలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు చేస్తున్నారు.  అదే ఆయనకు  ప్రత్యేకతను ఆపాదించింది. విజయాల్ని తెచ్చిపెట్టింది. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు వికటించాయి. దాంతో విజయం కోసం నారా రోహిత్ ఈ సారి కమర్షియల్ బాటను అనుసరించారు. అతడి ఆలోచన బాగానే ఉన్నా కథను ఎంచుకునే విషయంలో మరోసారి  తప్పటడుగు వేయడంతో హిట్ కొట్టాలనే నిరీక్షణకు ఈ సినిమా తెరదించలేకపోయింది.

బాలు(నారా రోహిత్) డబ్బు కోసం ఏ పనైనా చేస్తుంటాడు. రోజుకు రెండు లక్షలకు ఆద్య(రెజీనా) అనే అమ్మాయికి బాడీగార్డ్‌గా ఉంటడానికి ఒప్పుకుంటాడు. ఆద్యను చంపడానికి రాయలసీమకు చెందిన ఫ్యాక్షనిస్తు నాయకుడు ప్రతాప్‌రెడ్డి(అజయ్)తో పాటు అతడి అనుచరులు వెతుకుంటారు. వారి బారి నుంచి ఆద్య రక్షించి ఆమె అత్తయ్య భానుమతికి(రమ్యకృష్ణ) ఆమెను క్షేమంగా  అప్పగించాలని బాలు ప్రయత్నిస్తాడు.  ఈ క్రమంలో బాలు, ఆద్యలకు ప్రతాప్‌రెడ్డి వల్ల ఎలాంటి ఇక్కట్లు ఎదురయ్యాయి? ఆద్యపై  ప్రతాప్‌రెడ్డి పగను పెంచుకోవడానికి కారణమేమిటి? మాధవ్‌రెడ్డి అలియాస్ మ్యాడీ(పృథ్వీ), చిట్టిబాబు(శ్రీనివాసరెడ్డి)ల సహాయంతో బాలు, ఆద్య ప్రతాప్‌రెడ్డి నుంచి ఎలా తప్పించుకున్నారన్నదే బాలకృష్ణుడు చిత్ర ఇతివృత్తం.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. పగ, ప్రతీకారాలకు వినోదాన్ని జోడించి దర్శకుడు పవన్‌ మల్లెల ఈ  కథను సిద్ధంచేసుకున్నారు. గతంలో ఈ తరహా కథాంశాలతో తెలుగులో లెక్కకుమించి సినిమాలు రూపొందాయి.  కథతో పాటు  కథనంలో 1990 నాటి శైలినే అనుసరించారు. ‘సాంబ’, ‘సఖియా నాతోరా’, ‘యజ్ఞం’ ఇలా రాయలసీమ నేపథ్యంలో వచ్చిన పలు సినిమాల్ని బాలకృష్ణుడు మరోసారి గుర్తుకు తెస్తుంది.  

రాయలసీమలోని ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోరుతో మొదలైన సినిమా ఎంతకు ముందుకు సాగదు. అక్కడే తిరుగుతుంది. హీరో, విలన్  తమ తెలివితేటలను ఉపయోగిస్తూ ఒకరితో మరొకరు పోటీ పడే  సన్నివేశాల్ని నిరాసక్తతను కలిగిస్తాయి. పాట, ఫైట్, కామెడీ ఇలా ఒకదాని తర్వాత మరొకటి పేర్చుతూ వెళ్లారు. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమకథైనా సరిగా మలిస్తే బాగుండేది.  ఆ అవకాశం ఉండి కూడా  కనీసం ప్రయత్నం చేయలేదు. ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే సినిమాలో అడుగడుగునా మైనస్‌లు కనిపిస్తాయి.

తన పంథాకు భిన్నంగా తొలిసారి అల్లరి కుర్రాడిగా రోహిత్ కనిపించారు.  ఈ పాత్ర కోసం బరువు తగ్గి కొత్త లుక్‌లో కనిపించారు. తెలంగాణ, చిత్తూరుతో పాటు పలు యాసలతో మాట్లాడారు. బాలకృష్ణ, చిరంజీవిలను అనుకరించారు. సినిమా కోసం ఏమేం చేయాలో అన్ని చేశారు. కథలో బలం లేకపోవడంలో రోహిత్ శ్రమ  మొత్త వృథా అయ్యింది. రెజీనా పాత్ర  అభినయం తక్కువ గ్లామర్ ఎక్కువ అన్న చందంగా సాగుతుంది. కేవలం పాటల కోసమే హీరోయిన్‌ను తీసుకున్నారు. ఉన్నంతలో ఈ సినిమాలో పృథ్వీ కామెడీ ఒక్కటే ఆహ్లాదాన్ని పంచుతుంది. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు.  పృథ్వీ కనిపించే ప్రతి సన్నివేశం వర్కవుట్ అయ్యింది. శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్‌తో పాటు జబర్ధస్త్ బృందం నవ్వించడానికి తమవంతు ప్రయత్నాలు చేశారు.

మణిశర్మ నేపథ్య సంగీతం, బాణీలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యాక్షన్ కథాంశాలకు నేపథ్య సంగీతాన్ని అందించడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. మెలోడీ ప్రధానంగా సాగే సాహిత్యం ఆకట్టుకుంటుంది.

ఐదు ఫైట్లు, ఆరు పాటలు కామెడీ ట్రాక్‌ల పార్ములాకు ఎన్నడో కాలం చెల్లిపోయింది. ఇలాంటి పాత కాలం నాటి కథలతో స్టార్‌హీరోలు చేసిన సినిమాల్ని సైతం ఏ మాత్రం ఆలోచించకుండా ప్రేక్షకులు పక్కనపెడుతున్నారు. అయినా కూడా కొంత మంది దర్శకులు ఇంకా మూసధోరణిలోనే ఆలోచిస్తున్నారు అనడానికి ఈ సినిమానే ఉదాహరణగా చెప్పవచ్చు.

రేటింగ్2.25/5