ఆత్మహత్యాయత్నం చేసిన ఏఎస్సై మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఆత్మహత్యాయత్నం చేసిన ఏఎస్సై మృతి

December 2, 2019

నవంబర్ 22న పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఎస్సై నరసింహులు చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. సీఐ వేధింపులు భరించలేక నర్సింహా పోలీస్‌ స్టేషన్‌ ముందే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెల్సిందే. 40 శాతం కాలినగాయాలతో డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు. బాలాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్‌ విభాగం ఏఎస్సైగా నరసింహులు గత ఏడాదిన్నర నుంచి డ్యూటీ చేస్తున్నారు. 

Balapur.

నవంబర్ 21న నరసింహులు అల్లుడి పెళ్లి బాలాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో జరిగింది. అదే రోజు రాత్రి 11.30 సమయంలో బాలాపూర్‌ పెట్రోలింగ్ వాహనంలో ముగ్గురు కానిస్టేబుళ్లు ఆ ఫంక్షన్‌హాల్‌ వద్దకు వచ్చి హారన్ కొట్టారు. దీంతో నరసింహులు కొడుకు సాయికిరణ్‌ బయటకు వెళ్లి ఏమిటని ఆరా తీసాడు. తమకు రూ.3 వేలు ఇవ్వాలని.. ఇవ్వకపోతే వేడుకను వెంటనే నిలిపివేయాలని కానిస్టేబుళ్లు డిమాండ్‌ చేశారు. మా నాన్న కూడా బాలాపూర్‌లోనే ఏఎస్సైగా పనిచేస్తున్నారు, కావాలంటే రూ.1,000 తీసుకుని వెళ్లిపోవాలని సాయికిరణ్ కోరారు. అయినా కానిస్టేబుళ్లు వినిపించుకోకుండా మీ నాన్న ఎవరో మాకు తెలియదని, ఏఎస్సై అయినా డబ్బులు ఇవ్వాల్సిందేనని వాగ్వాదానికి దిగారు. 

దీంతో సాయికిరణ్‌ లోపలికి వెళ్లి తన తండ్రికి విషయాన్ని వివరించారు. దీంతో ఒకే పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నా కానిస్టేబుళ్లు తానెవరో తెలియదన్నట్లు మాట్లాడడంతో నరసింహులు కోపంగా బయటకు వచ్చి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లు ఈ మాటలను మొబైల్ ఫోన్‌లో రికార్డుచేసి సీఐ సైదులుకు చూపించారు. తరువాత రోజు సాయికిరణ్‌ బాలాపూర్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కానిస్టేబుళ్ల తీరుపై సీఐ సైదులుకు ఫిర్యాదు చేశారు. కానీ, ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండానే నరసింహులును మంచాల పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో తీవ్రమనస్తానికి గురైన నరసింహులు బాలాపూర్‌ పీఎస్‌ సమీపంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కి, పెట్రోల్‌ పోసుకున్నారు. ఆయన్ను కాపాడేందుకు కానిస్టేబుళ్లు ప్రయత్నించేలోపే ఒంటికి నిప్పంటించుకున్నారు. పైకి చేరుకున్న కానిస్టేబుళ్లు ఆయన ఒంటిపై మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు.