బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర! - MicTv.in - Telugu News
mictv telugu

బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర!

September 5, 2017

ప్రతీ ఏడాది  భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాడు బాలాపూర్ గణపయ్య. గణేష్ నవరాత్రులు అయిపోతున్నయంటే చాలు అందరి దృష్టి ఈయనపై వైపే ఉంటుంది. బాలాపూర్ లడ్డూ వేలం పాట అప్పుడే మొదలవుతుంది కాబట్టి. అనుకున్నట్లుగానే  ఈసారి బాలాపూర్ లడ్డు 15.60 లక్షల రికార్డు ధర పలికింది. జూబ్లీహిల్స్ కు చెందిన వ్యాపారి నాగం తిరుపతిరెడ్డి బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు. పోయిన ఏడాది కంటే 95 వేల రూపాయలు ఎక్కువగా పలికింది.

 బాలాపూర్ లడ్డూ అంటే ఎందుకంత ప్రత్యేకం..

 37 ఏళ్లుగా అంటే 1980లో బాలాపూర్ గణేశుని ప్రస్ధానం మొదలైంది. 23 ఏళ్లుగా లడ్డూ వేలం పాటతో బాలాపూర్ గణేశుడికి మరింత ఖ్యాతి పెరిగింది. ఈ గణేశుని దర్శనంకోసం స్థానికులే కాకుండా వివిధ ప్రాంతా లనుంచి భక్తులు వస్తారు. గణేశుడి చేతిలో ఉన్న లడ్డూ సొంతం చేసుకుంటే సిరిసంపదలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. 1994 నుంచి బాలాపూర్ లో లడ్డూ వేలం పాట మొదలుపెట్టారు. మొదట 450 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం…క్రమంగా వందలు, వేలు దాటి లక్షలు దాటింది. పేద, ధనిక, రైతు, రాజకీయ నాయకులని తేడా లేకుండా అంతా వేలంపాటలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మొదట బాలపూర్ వాసులే వేలం పాటలో పాల్గొనేవారు.

ఆ తర్వాత క్రమంగా ఇతరులకు అవకాశం కల్పించారు. బాలాపూర్ గణేశుడి చేతిలో ఉండే లడ్డూను ఈసీఐఎల్ లోని తాపేశ్వరం హనీపుడ్స్ తయారుచేస్తుంది. 21 కిలోల బరువు ఉండే ఈ లడ్డూను 2010 నుంచి బాలాపూర్ గణేశుడికి ఆ దుకాణ యజమాని ఉమామహేశ్వర్ రావు  నైవేద్యంగా సమర్పిస్తున్నారు. లడ్డూతో పాటు 2 కిలోల వెండి గిన్నెను స్వామివారికి సమర్పించి భక్తిని చాటుకుంటున్నారు.

15 ఏళ్లుగా లక్షల్లో  వేలం

ఏటేటా రికార్డుస్థాయిలో ధర పలికే బాలాపూర్ లడ్డూ… 2002 సంవత్సరం నుంచి  లక్షలు దాటింది. అంతకుముందు స్థానికులైన కొలను కుటుంబసభ్యులే వరుసగా లడ్డూను చేజిక్కించుకునేవారు. కానీ ఇతర ప్రాంతాల వారు కూడా రంగంలోకి దిగడంతో లక్ష కాస్త మరో లక్షకు చేరింది. అలా… 2008లో 5.07 లక్షలు, 2009లో 5.10 ల‌క్షలు, 2010లో 5.35 ల‌క్షలు, 2011లో 5.45ల‌క్షలు,  2012లో ఏకంగా 7.50 ల‌క్షలు ప‌లికింది. 2013లో  మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి ఏకంగా రూ.9.26 ల‌క్షల‌కు   లడ్డూను దక్కించుకున్నారు.

అనంతరం 2014 లో బాలాపూర్ కు చెందిన రైతు సింగిరెడ్డి జైహింద్ రెడ్డి పోటీపడి 9. 50 ల‌క్షల‌కు  లడ్డూను సొంతం చేసుకున్నారు. 2015లో  కళ్లెం రామకృష్ణారెడ్డి, మదన్ మోహన్ రెడ్డిలు తమ తండ్రి కళ్లెం రాంరెడ్డి జ్ఞాపకార్థం. రూ.10.32ల‌క్షల‌కు గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. 2016లో మేడ్చల్ కు చెందిన స్కైలాబ్  రెడ్డి రికార్డుస్థాయిలో 14.65 ల‌క్షల‌ రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది జూబ్లీహిల్స్ కు చెందిన నాగం తిరుప‌తిరెడ్డి ఏకంగా రూ.15.60ల‌క్షలకు ల‌డ్డూను సొంతం చేసుకున్నారు.

బాలాపూర్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును  గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు, సామాజిక కార్యక్రమాలకు  ఖర్చు చేస్తారు.