పాట వెళ్లిపోయింది... ఎస్పీ బాలు కన్నుమూత.. - MicTv.in - Telugu News
mictv telugu

పాట వెళ్లిపోయింది… ఎస్పీ బాలు కన్నుమూత..

September 25, 2020

Balasubrahmanyam passed away

స్వరగంధర్వుడు వేల పాటలు వర్షిస్తూ నింగికి వెళ్లిపోయాడు. మన బాలు ఇక లేరు. తెలుగు పాటకు అర్ధశతాబ్దం పాటు తనే చిరునామా మారిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిన్నటి నుంచి విషమించడం తెలిసిందే. మధ్యాహ్నం 1.08 గంటలకు ఆయన ప్రాణసంగీతం మూగబోయింది. ఆయన భార్య సావిత్రి, కూతురు పల్లవి, కొడుకు చరణ్ ఉన్నారు. 

బాలు వయసు 74. ఆయన నెల్లూరు జిల్లా  కోనేటమ్మపేటలో 1946 జూన్ 4న  బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి హరికథా కళాకారుడు. ఇంజినీరింగ్ చేయడానికి మద్రాస్ వెళ్లిన బాలు 1966 లో ‘శ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంతో గాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. తొలినాళ్లలో ఘంటసాలతో కలసి పాడారు. తర్వాత తెలుగు సినిమా పాట అంటే తనే అన్నట్లు చెలరేగిపోయారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర 11 భాషల్లో 40 వేల పాటలు పాడిన బాలు గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. జాతీయ పురస్కారాలతోపాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 40 సినిమాలకు ఆయన సంగీతం అందించారు. బాలు చక్కని నటుడు కూడా ‘ఓ పాపా లాలీ’ చిత్రం ఆయన నటనకు అద్దం పడుతుంది. బాలు సోదరి శైలజ కూడా గాయనే అన్న సంగతి తెలిసిందే. వయసు కారణంగా సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో ఆయన టీవీ కార్యక్రమాలపై మళ్లారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా వందలమంది కొత్త గాయకులను పరిచయం చేశారు.