Balayya made Mahesh laugh with his words
mictv telugu

మాటలతో మహేశ్‌‌ని నవ్వించిన బాలయ్య.. వీడియో వైరల్

November 16, 2022

సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు చివరి సారి చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు. టాలీవుడ్‌ను కొత్త పుంతలు తొక్కించిన నటశేఖరుడు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం నానక్ రాం గూడలోని విజయకృష్ణ నివాసంలో ఆయన పార్థీవ దేహం వద్ద బారులు తీరారు. అయితే నందమూరి బాలకృష్ణ నిన్న నగరంలో లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.

ఇవ్వాళ పద్మాలయా స్టూడియోకి వెళ్లి స్వయంగా నివాళులు అర్పించారు. భార్య వసుందరా దేవి, కూతురు బ్రాహ్మణితో కలిసి వెళ్లి మహేశ్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అయితే మాటల సందర్భంలో మహేశ్ బాబు, ఆయన కుమారుడు గౌతమ్‌లను బాలయ్య నవ్వించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్నటి నుంచి తడిసిన కన్నీళ్లతో చాలా విషాదంగా కనిపించిన మహేశ్ మొఖంలో క్షణకాలం పాటు నవ్వులు పూయించిన బాలయ్యకు ఘట్టమనేని అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ ‘మీ సపోర్టును ఎప్పటికీ మర్చిపోం’ అంటూ ట్యాగ్ చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుమారుడు మహేశ్ బాబు తండ్రికి తలకొరివి పెట్టారు.