నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా గురువారం రిలీజైంది. విడుదలైన ప్రతీ ప్రాంతంలోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. హైదరాబాద్ నగరంలో ఉదయం నాలుగు గంటల ఆట 54 థియేటర్లలో ప్రదర్శితమై హౌస్ ఫుల్ అవడం ఓ రికార్డు అయితే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 54 కోట్లను కలెక్ట్ చేయడం మరో రికార్డుగా చెప్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే ఇంత భారీ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్లు రావడం ఇదే మొదటిసారి.
బోయపాటితో చేసిన సినిమాలు బంపర్ హిట్ అయినా కూడా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. దీనికి సంబంధించిన పోస్టర్ ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. శ్రుతీహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మాటలు, పాటలు, కథా కథనాలు, సంగీతం, ఫోటోగ్రఫీ, బాలయ్య నటన ఇలా అన్నీ కలిసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఇలా అన్ని అంశాలు కలిసి రావడం వల్లనే ఈ రేంజు హిట్ కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే శుక్రవారం చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదల అవడంతో కలెక్షన్లపై ఏమాత్రం ప్రభావం పడనుందనే సమాచారం శనివారానికి తెలుస్తుంది. అటు చిరంజీవి మొదటి రోజు ఎంత వసూలు చేశాడనే విషయం కూడా అదే రోజు వెల్లడి కానుంది.