ఈ రోజుల్లో బట్టతల సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. 35 ఏండ్లు పైబడిన వారిలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. యువకుల్లో కూడా బాధితులు ఎక్కువగానే ఉన్నారు. జుట్టు ఊడడం కొందరు లైట్ గా తీసుకుంటారు కానీ అదే ఊడిన జుట్టు కూడా తిరిగిరాదన్న నగ్న సత్యం తెలిసిన వారు మాత్రం మనస్థాపానికి గురికాక మానరు. ఎందుకంటే నలుగురిలో అందవిహీనంగా కనబడి.. కాన్ఫిడెంట్ లెవల్స్ దెబ్బతిని.. చివరకు ఆ సమస్య ఎక్కడికో దారి తీస్తుంది. ఫలితంగా ఆర్థిక నష్టం.. ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా. ఇన్ని సమస్యలు భరిస్తూ.. నలుగురిలో అవమానానికి గురవుతున్న వారంతా ప్రభుత్వం తరపున పరిహారం కోరుతున్నారు.
బట్టతల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6000 పెన్షన్ అందజేయాలని బట్టతల బాధితుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ సంఘానికి కొహెడ మండలానికి అధ్యక్షుడిగా ఉన్న వెల్ధి బాలయ్య .. గురువారం సదరు బాధితుల సంఘం సభ్యులతో సమావేశమై.. సీఎం కేసీఆర్ బట్టతల బాధితులకు రూ.6 వేల ఫించన్ ఇవ్వాలని కోరారు.
ఈ సమాజంలో బట్టతల బాధితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని మానసిక వికలాంగుల క్రింద బాధితులందరికీ సంక్రాంతి పండుగ లోపు పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో బట్టతల బాధితుల జిల్లా సంఘం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని .. అలాగే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని చెప్పారు. కాగా వెల్ధి బాలయ్య ఇటీవల ఈ సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోశాధికారిగా మౌటం రాము , సభ్యులుగా పిల్లి నర్సయ్యతో పాటు మరికొందరు ఎన్నికయ్యారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ద ఎత్తున బట్టతల బాధితులు పాల్గొన్నారు.