ఇండోనేసియాలోని బాలి ద్వీపం వార్తల్లోకి ఎక్కింది. అది పర్యాటక ప్రాంతం కదా, ప్రత్యేకంగా వార్తల్లోకి ఎక్కడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. అక్కడికి వెళ్తున్న విదేశీ పర్యాటకుల్లో కొందరు మరీ బరితెగించిపోవడం వల్ల బాలి వార్తల్లోకి వచ్చిందన్నమాట. భూతల స్వర్గంలాంటి బాలి దీవులకు వెళ్తున్న జనం అక్కడ నిజంగానే ‘స్వర్గసుఖాలు’ అనుభవించడానికి మాటల్లో చెప్పడానికి వీల్లేని నీచనికృష్ట పనులు చేస్తున్నారు. దీంతో ఆ దీవులను వేల యేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలిలోని పర్వతాలను హిందువులు చాలా పవిత్రంగా పూజిస్తుంటారు. అలాంటి చోట్ల పర్యాటకులు కొన్నాళ్లుగా నగ్నంగా డ్యాన్సులు చేస్తూ, అసభ్య వ్యవహారాలు నడుపుతున్నారు. రష్యాకు చెందిన ఓ పోర్నుస్టారు అక్కడ ఏకంగా శృంగారం చేస్తూ వీడియో తీసుకుని అమ్ముకుంది.
దేవతలు ఉంటారు..
మౌంట్ బతూర్ పర్వతంపై ఇటీవల కొందరు కామకలాపాలు కూడా మెదలుపెట్టేశారు. ఇది హిందువులకు తీవ్ర కోపం, ఆవేదన కలిగిస్తోంది. ‘పొద్దున కొండల దగ్గరికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఎక్కడ ఏం కనబడి చస్తుందోనని హడలిపోతున్నాం. ఇంకెక్కడా చోటులేనట్టు ఇక్కడికే వచ్చి ఆ పనులు చేసుకోవాలా?’’ అని వాపోతున్నారు. బాలిలోని 43 లక్షల జనాభాలో 87 శాతం హిందువులే(38 లక్షల మంది). తమ దేవతలు నివసించే కొండల్లో గలీజ్ పనులు చేస్తున్నారని, ఇది దేనికి దారితీస్తుందో చెప్పలేమని అంటున్నారు. పర్యాటకుల చేష్టలపై బాలి గవర్నర్ వయాన్ కోస్తర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పర్వతాల్లో ఇకపై కొత్త రూల్స్ తెస్తామని చెబుతున్నారు. బతూర్ కొండపై సూర్యోదయ దృశ్యం రమణీయంగా ఉంటుంది కనక పర్యాటకులు అరుదైన అనుభవాల కోసం అక్కడికి ఎగబడుతున్నారు.