ఆదరించండి ఆశీర్వదించండి - MicTv.in - Telugu News
mictv telugu

ఆదరించండి ఆశీర్వదించండి

July 1, 2017

 

‘ మైక్ టీవీ ’ ని ప్రారంభించి ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాలేదు. కాని మేము చేసిన రెండు పాటలతోనే సోషల్ మీడియాలో మాకో ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు. గంటకు నాలుగు సార్లు చూపించేందుకు మాకు షాటిలైట్ ఛానల్ లేదు. లక్షల సబ్ స్క్రైబర్లు మాకు లేరు. వందల కోట్ల నెట్ వర్క్ మా వెనకాల లేదు. మా పాటల్లో సినిమా డ్యాన్సర్లు, భారీ అట్టహాసాలతో సెట్టింగులు కనిపించవు. కానీ మాలో ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన ప్రభావం నరనరాన ఉన్నది. అందుకే మా పాటల్లో, మాటల్లో, ఆటల్లో తెలంగాణ ఆత్మ ఉంటది. ఎక్కడా ఒరిజినాలిటీని పాడు చేయకుండా, డ్రమటైజ్ చేయకుండా సగటు గ్రామాల్లో జరిగే పండగలు, దావత్ లల్లో వేసే డ్యాన్స్ లే మా పాటలకు ప్రాణమయ్యాయి. మేము కూడా ఆ వాడల నుంచి వచ్చినవాళ్ళమే అని గర్వంగా చెప్పుకుంటున్నాం.

రేలారే రేలా

తెలంగాణా ఫార్మేషన్ డే సందర్బంగా మేము చేసిన ‘ రేలారే రేలా ’ పాటకు ఫేస్ బుక్ లో 17 వేలు, యూట్యూబ్ లో 17 వేల షేర్లు వచ్చాయి. మొత్తంగా రేలారే సాంగ్ 35 వేల షేర్లు అయింది. 25 లక్షల వ్యూస్ వచ్చాయి. పాటను రిలీజ్ చేసి 25 రోజులవుతున్నా ఇప్పటికీ ఈ పాటను అందరూ ఆదరిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ పాట చక్కర్లు కొడుతూనే ఉన్నది. చాలా మంది మోబైల్ ఫోన్లల్లో వినిపిస్తోంది. విశేషం ఏమిటంటే ఆంధ్రా సోదరులు కూడా ఈ పాటను గొప్పగా ఆదరిస్తున్నారు. యూట్యూబ్ లో వచ్చిన మెసేజ్ లల్లో చాలా మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు ‘ కందికొండ ’ అద్బుతమైన సాహిత్యాన్నిస్తే, ‘ నందన్ ’ వినసొంపైన ట్యూన్ ని అందించాడు. గాయని ‘ లిప్సిక ’ తన గాత్రంతో పల్లె పాటకు తన ర్యాప్ తో వన్నె తెచ్చింది. అన్నింటికి మించి మంగ్లి(సత్యవతి) ఈ పాటకు తన గానంతో ప్రాణం పోసింది. యూట్యూబ్ లో రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ‘ మైక్ టివీ ’ యూట్యూబ్ ఛానల్ కి కేవలం ‘ 11 ’ వేల మంది సబ్ స్ర్కైబర్స్ మాత్రమే ఉన్నారు. మైక్ టీవీ ఎఫ్బీ పేజికి ప్రస్తుతం ‘ 14 ’ వేల లైకులు మాత్రమే ఉన్నాయి అయినా ఫేస్ బుక్ లో 6లక్షల వ్యస్ వచ్చాయి. ఇది మా గొప్పతనం కాదు మీ మంచి తనం.

డిల్లెం బల్లెం

ఇక బహుజనుల పండుగ బోనాల సందర్బంగా మైక్ టీవీ చేసిన ‘ డిల్లెం బల్లెం ’ పాటకు మేము ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. అభినయ శ్రీనివాస్ సాహిత్యం, సురేష్ బొబ్బిలి సంగీతం, గానం, డ్యాన్స్ తో చాలా కొత్తగా ఈ పాటను మైక్ టీవీ రూపొందించింది. రోటీన్ గా, సినిమాటిక్ గా కాకుండా తెలంగాణ పల్లెటూరులో బహుజన బిడ్డలతో ఈ బోనం పాటను చిత్రీకరించాము. ఈ పాటకు యూట్యూబ్, ఎప్బీలో కలిపి ఐదు రోజుల్లో 10 లక్షల వ్యూస్, యూట్యూబ్ 5 వేల షేర్లు, ఫేస్ బుక్కులో 11 వేల షేర్లు. మొత్తం కలిపి 17 వేల షేర్లు వచ్చాయి. ఇప్పటికే ఈపాట పండుగ దావత్ లల్లో మారు మ్రోగుతోంది. వీటితో పాటు హలీంపై చేసిన పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రంజాన్ మాసంలో ముస్లీం సోదరుల జీవన చిత్రంలో హలీం వంటకం ప్రత్యేకతను చాటుతూ చేసిన ఈ వీడియోతో పాటు హైదరాబాద్ సిటీలో నైట్ లైఫ్ లో సగటు జీవి బతుకు చిత్రాన్ని చాటేందుకు కత్తి కార్తికతో చేసిన ‘సలాం హైదరాబాద్’ప్రోగ్రాం ప్రారంభించడానకి ముందు రిలీజ్ చేసిన ప్రోమో కు ఊహించని స్పందన లభించింది. త్వరలో పూర్తి కార్యక్రమం రాబోతోంది. దీన్నిబట్టి మీరంతా మామీద హైలీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారనిపిస్తోంది.

వీ ఆర్ డిఫరెంట్ అన్నది ఊరికే మేము పెట్టుకున్న క్యాప్షన్ కాదు. డిఫరెంట్ గా చేసేందుకే మా ప్రయత్నం. రాబోవు రోజుల్లో మరిన్ని మంచి పాటలు, మంచి ప్రోగ్రామ్ లతో మీ ముందుకు వస్తాము. ఎందరో మట్టి బిడ్డలను ప్రపంచానికి పరిచయం చేయాలన్నది మా ప్రయత్నం. చివరగా తెలంగాణ సంస్కృతికి, సాహిత్యానికి, ఆటకు, మాటకు, పాటకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ‘ మైక్ టీవీ ’ చేసే ప్రతీ కార్యక్రమంలో వీటిని మరవబోమని విన్నవిస్తూ……. మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి.
నమస్కారం

మీ ‘ మైక్ టీవి ’ టీం