సుప్రీంకోర్టు తీర్పుతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రశాంతంగా జరిగినప్పటికీ.. ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాగానే ఢిల్లీ మున్సిపల్ సమావేశం రచ్చ రచ్చ(AAP Vs BJP)గా మారింది. స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే సమయంలో సభ్యులు తమ సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడానికి అనుమతిస్తామన్న మేయర్ షెల్లీ ఒబెరాయ్ నిర్ణయాన్ని బీజేపీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. వెల్‌లోకి వచ్చి మేయర్ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్ సభ్యులు.. మేయర్ నిర్ణయానికి మద్దతుగా నినాదాలు చేయటం వల్ల సదన్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు పార్టీలకు చెందిన నేతలు దాదాపు తన్నుకున్నారు. సభ్యులు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్నారు. వాటర్ బాటిళ్లు, పేపర్లు, చేతికి దొరికిన ప్రతి వస్తువును విసురుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఓటింగ్ ప్రక్రియను మేయర్ పలుమార్లు వాయిదా వేశారు.
#WATCH | Delhi: Ruckus and sloganeering continue at MCD house as AAP-BJP councillors clash with each other after the house proceedings resumed for the fourth time. The MCD house was again adjourned for the fifth time since last night. pic.twitter.com/O6MO2cOgs1
— ANI (@ANI) February 23, 2023
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తుండగా బీజేపీ సభ్యులు వెల్‌లోకి రావడమే కాకుండా తనపై దాడికి యత్నించారని మేయర్ ఆరోపించారు. మహిళా మేయర్‌పై దాడికి యత్నించడం భాజపా నేతల గూండాగిరికి నిదర్శనమని ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సదన్‌లో.. బీజేపీ సభ్యుల ప్రవర్తన దిగ్బ్రాంతి కలిగించిందని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. స్టాండింగ్ కమిటీ.. ఎన్నికల ప్రక్రియ అర్ధరాత్రి వరకు గందరగోళం, వాయిదాల మధ్య కొనసాగింది. తీవ్ర ఉత్కంఠ మధ్య బుధవారం జరిగిన ఢిల్లీ నగరపాలిక మేయర్ ఎన్నికలో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్.. భాజపా అభ్యర్థి రేఖాగుప్తాపై 34 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 15ఏళ్లు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈసారి ఓటమిపాలైంది.