Balwinder Singh smoked a cigarette on the plane
mictv telugu

స్పైస్‌జెట్‌లో దర్జాగా స్మోకింగ్.. దర్యాప్తుకు ఆదేశించిన డీజీసీఏ

August 11, 2022

Balwinder Singh smoked a cigarette on the plane

స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఇటీవల కాలంలో సాంకేతిక కారణాలతో పలు మార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన మరో భారీ పొరపాటు ఆ సంస్థ ప్రతిష్టను మసకబార్చింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దర్జాగా సిగరెట్ తాగుతూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీరియస్ అయిన డీజీసీఏ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.

వివరాల్లోకెళితే.. గుర్‌గావ్‌కు చెందిన బల్విందర్ కటారియా వీడియోలు చేస్తూ వాటిని తన 6 లక్షల ఫాలోవర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న అతను విమానంలోనే ఠీవీగా సిగరెట్ కాల్చి వీడియో తీశాడు. దీనిని ఓ యూజర్ షేర్ చేస్తూ హోం మంత్రి అమిత్ షా, విమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, డీజీసీఏతో పాటు సీఐఎస్ఎఫ్‌లకు ట్యాగ్ చేశాడు. దానికి ఈ వ్యక్తికి కొత్త రూల్స్ అంటూ క్యాప్షన్ పెట్టడంతో అధికారులు హుటాహుటిన స్పందించి చర్యలకు ఉపక్రమించారు. డీజీసీఏ దర్యాప్తుకు ఆదేశించింది. స్పైస్ జెట్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. అటు తన చర్యను నిందితుడు సమర్ధించుకోవడం గమనార్హం. కాగా, విమానంలో పొగ త్రాగడం నిషేధం. ప్రయాణీకులకు ఇబ్బందితో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశముండడంతో ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 ప్రకారం ధూమపానం, అగ్గిపెట్టెలు, మండే స్వభావం ఉన్న వస్తువులు విమానంలో తీసుకెళ్లడాన్ని అనుమతించరు.