ban has been imposed on the sale of liquor in Hyderabad on the occasion of Ganesh Nimajjanam.
mictv telugu

గణేశ్ నిమజ్జనం.. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్!

September 8, 2022

హైదరాబాద్‌ నగరంలో మహా గణపతి నిమజ్జనం ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం, శనివారం (సెప్టెంబర్9, 10) రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. తిరిగి మళ్లీ శనివారం సాయంత్రం తెరుచుకోనున్నాయి. వినాయక నిమజ్జనం నేపథ్యంలో దుకాణాలు మూసి వేయాలని హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ మేరకు రెండు రోజుల పాటు షాపులు మూసివేస్తున్నట్లు అన్ని వైన్స్‌ షాపుల ముందు యజమానులు బోర్డులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. కల్లు దుకాణాలు, వైన్స్, బార్, లిక్కర్ షాప్ లు బంద్ ఉంటాయని పోలీసులు తెలిపారు

గత వారం రోజులుగా ఎన్టీఆర్‌ ఘాట్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డు మార్గంలో సాగర్‌ ఒడ్డున 9 క్రేన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. తాజాగా ట్యాంక్‌బండ్‌ పైన పది, నెక్లెస్‌ రోడ్డులో మూడు క్రేన్లను కలిపి బుధవారం సాయంత్రం నాటికి 22కు పెంచారు. ఇక నిమజ్జనం రోజున తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9న హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా సెలవు ప్రకటించింది. దీనికి సంబంధించి బుధవారం జీవో జారీచేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాల్లో సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.