రష్యాకు చేదు అనుభవం.. ప్రపంచ క్రీడల్లో నో ఎంట్రీ  - MicTv.in - Telugu News
mictv telugu

రష్యాకు చేదు అనుభవం.. ప్రపంచ క్రీడల్లో నో ఎంట్రీ 

December 9, 2019

Olympics01

డోపింగ్ ఆరోపణలు రష్యా కొంపముంచాయి. ప్రతిష్టాత్మక 2020 టోక్యో ఒలింపిక్స్‌, 2022 వింటర్‌ ఒలింపిక్స్‌లతోపాటు మరే అంతర్జాతీయ క్రీడా పోటీల్లోనూ పాల్గొకుండా ఆ దేశంపై నిషేధం వేటు పడింది. ఇది నాలుగేళ్లపాటు అమల్లో ఉంటుంది. నిషేధం విధించాలని వచ్చిన ప్రతిపాదనకు ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంఘం (వాడా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. డోపింగ్‌ కేసులపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు రష్యా ప్రభుత్వం తప్పుడు వివరాలు అందించినట్లు తేలడంతో నిషేధాన్ని విధించారు. 

రష్యా డోపింగ్‌ నిరోధ సంఘంపై నాలుగేళ్ల నిషేధాన్ని వాడా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిందని వాడా అధికార ప్రతినిధి జేమ్స్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌ తెలిపారు. నిషేధం ప్రకారం.. రష్యా క్రీడాకారులు దేశం తరఫున అధికారికంగా పాల్గొనడం కుదరదు. తమకు ప్రభుత్వంతో సబంధం లేదని, డోపింగ్ వ్యవస్థలో తాము భాగం కాదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. రష్యా నిబంధనల ప్రకారం చూస్తే ఇది కష్టమైన పనే. పతకాల యావతో రష్యా ప్రభుత్వం డోపింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2011-15 మధ్య ఇది విపరీతంగా సాగిందని తేలింది.