అరటిపండ్ల-ఖర్చు-రూ-35లక్షల
mictv telugu

అరటిపండ్ల ఖర్చు రూ.35లక్షలు.. ఇదేంటని ప్రశ్నిస్తే అంతే ఇక..

July 14, 2022

Banana bill of Rs 35 lakh, ‘death threats’: Uttarakhand cricket under cloud

క్రికెటర్ల కోసం అరటిపండ్లకు రూ. 35 లక్షలు, వాటర్ బాటిల్స్ కు రూ. 22 లక్షలు ఖర్చు చేసినట్టు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్‌(సీఏయూ) లెక్కల్లో చూపించడం కలకలం రేపుతోంది. ఈ ఖర్చును బట్టి సీఏయూలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నట్లు తేలింది. 2020లో కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఏకంగా రూ.11 కోట్లను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరఖండ్ ఖర్చు చేసింది. ఫుడ్, కేటరింగ్‌కి రూ.1.74 కోట్ల మొత్తం ఖర్చు చేయగా ఇందులో అరటి పళ్ల బిల్లు ఏకంగా రూ.35 లక్షలుగా ఉంది. ఆటగాళ్లకు ట్రైనింగ్ క్యాంప్ లు ఏర్పాటు చేయకున్నా.. వాటిని నిర్వహించినట్టు లెక్కల్లో చూపి లక్షల రూపాయలు దండుకుంటున్నారని పలువురు క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.

ఇక ఎవరైనా క్రికెటర్లు బోర్డులో అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే వారిని జట్టులోంచి తప్పించడం.. నోర్మూసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించడం వంటివి చేసేవారని పలువురు ఆటగాళ్లు వాపోతున్నారు. అక్రమాలపై నిలదీసి అడిగేవారిని చంపుతామని కూడా బెదిరించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ రాష్ట్రం తరఫున అండర్-19 ఆడిన ఆర్యా సేథికి ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు సమాచారం. దీంతో అతడి తండ్రి వీరేంద్ర సేథి డెహ్రాడూన్ లోని వసంత విహార్ పోలీస్ స్టేషన్ లో సీఏయూ సెక్రెటరీ మహిమ్ వర్మ, జట్టు హెడ్ కోచ్ మనీష్ ఝా, అసోసియేషన్ స్పోక్స్ పర్సన్ సంజయ్ గుసాయిన్ లపై ఫిర్యాదు చేశాడు. ఉత్తరాఖండ్ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని మూడు రోజుల పాటు విచారించారని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ జనమేజయ ఖందూరి తెలిపాడు.